Ys Jagan : పార్టీకి ఊపిరి పోయాలంటే ఈ నిర్ణయం తీసుకోవాల్సిందేనా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి

Update: 2025-10-31 09:00 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఇక నియోజకవర్గాలకు ఇన్ ఛార్జులను నియమిస్తారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇప్పటి వరకూ చాలా నియోజకవర్గాలకు ఇన్ ఛార్జులున్నారు. అయితే గత ఎన్నికల్లో నాడు మంత్రులుగా ఉన్న వారిని ఎమ్మెల్యేలను నియోజకవర్గాలను మార్చి కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. అయితే అలాంటి నియోజకవర్గాలకు వెళ్లి 2024 ఎన్నికల్లో ఓటమి పాలయిన నేతలు తమకు ఎన్నికల సమయంలో కేటాయించిన కొత్త నియోజకవర్గాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. జగన్ మాట కాదనకుండా కొందరు వెళుతున్నా మనస్పూర్తిగా అక్కడ క్యాడర్ తో మమేకం కావడం లేదు.

ఇన్ ఛార్జుల విషయంలో...
ఈ విషయాలన్నీ వైసీపీ అధినేత దృష్టికి వచ్చినట్లు తెలిసింది. చాలా నియోజకవర్గాల్లో క్యాడర్ కు అందుబాటులో లేకపోవడం, కేవలం తనతో జరిగే సమావేశాలకు మాత్రమే హాజరవుతున్నారని గుర్తించారు. దీంతో క్యాడర్ కూడా అయోమయంలో పడింది. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే ఏడాది ఆరంభంలోనే జరగనున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభమయింది. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జులు యాక్టివ్ గా లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలలో సరైనోళ్లకు టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉండదు. ఎవరో ఒకరికి సీట్లు కేటాయిస్తే పార్టీ రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది.
వచ్చే నెలలో...
క్యాడర్ కూడా తమకు స్థానిక సంస్థల్లో అవకాశం దక్కుతుందని భావిస్తేనే యాక్టివ్ గా ఉంటారు. కానీ వారికి ఏ రకమైన హామీ ఇచ్చే నేత చాలా నియోజకవర్గాల్లో లేరు. అందుకే క్యాడర్ కూడా కొంత అయోమయంలో ఉంది. ఈ పరిస్థితుల్లో వైఎస్ జగన్ నవంబరు నెల తొలి వారంలో పార్టీని ప్రక్షాళన చేయాలని నిర్ణయించారని తెలిసింది. నియోజకవర్గాల ఇన్ ఛార్జులను తిరిగి నియమించే ప్రక్రియను ప్రారంభించనున్నారని చెబుతున్నారు. అప్పుడే క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం అవుతుందని ఆయనకు నివేదికలు అందడంతో నేతలు ఇష్టాయిష్టాలను కనుక్కున్న తర్వాత మాత్రమే వారిని ఇన్ ఛార్జులుగా నియమించాలా? వద్దా? అన్నది నిర్ణయిస్తారన్నది అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.










Tags:    

Similar News