Ys Jagan : వైఎస్ వివేకా హత్య.. విశాఖ డ్రగ్స్ కేసుపై జగన్ తొలి సభలో ఏమన్నారంటే?

వైఎస్ వివేకా హత్య, విశాఖ డ్రగ్స్ కేసులో ఎవరు నిందితులో అందరికి తెలుసనని వైఎస్ జగన్ అన్నారు

Update: 2024-03-27 13:39 GMT

వైఎస్ వివేకా హత్య, విశాఖ డ్రగ్స్ కేసులో ఎవరు నిందితులో అందరికి తెలుసనని వైఎస్ జగన్ అన్నారు. తొలి రోజు బస్సు యాత్రలో భాగంగా ఆయన ప్రొద్దుటూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. కష్టాల్లో తన వెంట ఉన్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎన్ని కష్టాలు వచ్చినా 2.70 లక్షల కోట్ల రూపాయలు పేదలకు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిదేనని అన్నారు. 2024 ఎన్నికల సమారానికి సిద్ధం అంటూ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారన్నారు. అందుకే మన జెండా ఏ జెండాతోనూ జత కట్టడం లేదన్నారు. ప్రజల అజెండాయే మన అజెండా అని ఆయన అన్నారు. భావితరాల కోసం విప్లవాత్మకమైన మార్పులను తీసుకు వచ్చామన్నారు. మంచికి మద్దతు పలికి సంక్షేమాన్ని కాపాడాలని ఆయన కోరారు.

పేదల వ్యతిరేకులను...
ఈ దుష్టచతుష్టయాన్ని తరిమేందుకు మీరు సిద్ధమేనా? అని జగన్ ప్రశ్నించారు. మే 13న ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి, మరో వంద మందికి చెప్పి వైసీపీిని గెలిపించాలని ఆయన కోరారు. అభివృద్ధి నిరోధకులను, పేదల వ్యతిరేకులను ఓడించడానికి సిద్ధమేనా? అని అడిగారు. మరో నలభై రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయని, మనకు పోటీగా ఉంది కుట్రలు చూసే కూటమి అని అన్నారు. నమ్మించి ప్రజలను నట్టేట ముంచడంలో చంద్రబాబుకు నలభైఐదేళ్ల అనుభవం ఉందన్నారు. అబద్ధాలు చెప్పడంలో, మోసాలు చేయడంలో, వెన్నుపోటు పొడవడంలో అనుభవం ఉంది ఈ పెద్దమనిషికి అని అన్నారు. మ్యానిఫేస్టోను ఎన్నికల అనంతరం చెత్తబుట్టలో వేసే అనుభవం ఉందన్నారు. కుటుంబాలను చీల్చడంలో కూడా అనుభవం ఆయనకు ఉందన్నారు.
వివేకాను చంపిన వారు...
చిన్నాన్నను ఎవరు చంపారో? ఎవరు చంపించారో? ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలు అందరికీ తెలుసునని, కానీ ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపారో? వాళ్ల వెనక ఎవరు ఉన్నారో తెలుసునని అన్నారు. చిన్నాన్న వైఎస్ వివేకాను దారుణంగా చంపిన బహిరంగా తిరుగుతున్న హంతకుడికి అందరూ మద్దతిస్తున్నారన్నారు. ఆ హంతకుడికి మద్దతిస్తున్నది చంద్రబాబు, ఎల్లోమీడియా, రాజకీయపదవుల కోసం తపించి పోతున్న తమ వాళ్లు అని అన్నారు. చిన్నాన్నను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వాళ్లతో చెట్టాపెట్టాలేసుకుని తిరుగుతున్నదెవరో ప్రజలకు తెలుసుకోవాలన్నారు. అదంతా వదిలి పెట్టి తనపై లేని పోని నిందలు వేస్తున్నారన్నారు.
అంతా బాబు బంధువులే...
బ్రెజిల్ నుంచి చంద్రబాబు వదిన చుట్టం డ్రగ్స్ ను విశాఖకు తీసుకు వస్తే సీబీఐ పట్టుకుందన్నారు. ఆ దాడులు జరిగిన వెంటనే ఎల్లో బ్రదర్స్ భయపడిపోయి మన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆ కంపెనీ యజమానులు బాబు బంధువులు, సన్నిహతులేనని అన్నారు. నేరం జరిగితే చేసేది వాళ్లు.. తోసేది వైసీపీ పైన అని జగన్ అన్నారు. అందరూ ఏకమై తనపై యుద్ధం చేస్తున్నారన్నారు. ఒకే ఒక్కడిపై ఒంటరిగా వచ్చే ధైర్యం ఎవరికీ లేదు అంటే దానికి కారణం ప్రజలు, దేవుడి దయ అని జగన్ అన్నారు. అభివృద్ధిని ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ ఎవరు వెళ్లి చూసినా తెలుస్తుందన్నారు.


Tags:    

Similar News