Tirumala : తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శన సమయం ఎంతంటే?
తిరుమల లో భక్తుల రద్దీ నేడు కొనసాగుతోంది.
తిరుమల లో భక్తుల రద్దీ నేడు కొనసాగుతోంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ కొంత ఎక్కువగానే ఉంది. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరగడంతో వేసవి రద్దీని తట్టుకునేందుకు అవసరమైన చర్యలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కంపార్ట్ మెంట్లలో కూలర్లను ఏర్పాటు చేశారు. అత్యాధునిక వ్యవస్థతో చల్లదనం ఉండేలా భక్తులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. మాడ వీధుల్లో నడిచేందుకు కార్పెట్లను పరిచారు. ఎండల తీవ్రత భక్తుల పై పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు.
ఎండల తీవ్రత అధికం కావడంతో..
తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరగడంతో పాటు వేసవి ఎండల తీవ్రత అధికం కావడంతో అధికారులు వసతి గృహాల విషయంలోనూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. అలాగే రద్దీ ఎక్కువవుతున్న తరుణంలో త్వరలో సిఫార్సు లేఖలను కూడా రద్దు చేసే అంశాన్ని కూడా పరిశీలించే ఆలోచనలో ఉన్నారు. రద్దీ అత్యంత ఎక్కువయినప్పుడు మాత్రమే ఈ నిర్ణయం తీసుకునే అవకాశముందని, అప్పటి వరకూ సిఫార్సు లేఖలను స్వీకరిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
31 కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వ దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు రెండు నుంచి మూడు గంటల్లో దర్శనం పూర్తవుతుంది. శనివారం స్వామి వారిని 82,838 మంది భక్తులు దర్శించుకున్నారు. 31.006 మంది భక్తులు తమ తలనీలాలు స్వామి వారికి సమర్పించారు.శ్రీవారి హుండీ ఆదాయం 3. 94 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.