YSRCP : వైఎస్ జగన్ కు ఆళ్ల పెట్టిన షరతులు ఏంటో తెలుసా?
మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి యాక్టివ్ గా కనిపించడం లేదు
మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి యాక్టివ్ గా కనిపించడం లేదు. గత కొద్ది రోజులుగా ఆయన రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నోటికి తాళం వేసుకుని మరీ తన వ్యాపారాలకు, వ్యవసాయానికి మాత్రమే పరిమితమయ్యారంటున్నారు.అసలు ఆళ్ల రామకృష్ణారెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదా? అన్న అనుమానం కూడా కలుగుతుంది. 2019 ఎన్నికలకు ముందే తాను ఎన్నికల్లో పోటీ చేయనని వైఎస్ జగన్ కు ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు. అయితే నాడు కాదంటూ జగన్ వారించడంతో తప్పనిసరి స్థితిలో పోటీకి దిగి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు.
పార్టీ మారి వచ్చినా...
వైసీపీకి రాజీనామా చేసి మరీ కాంగ్రెస్ లోకి వెల్లి తిరిగి మళ్లీ జగన్ చెంతకు చేరారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి వరసగా రెండుసార్లు మంగళగిరి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి గెలిచారు. 2019 ఎన్నికల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై విజయం సాధించారు. అయితే మంత్రివర్గంలో వైఎస్ జగన్ కు ఆయన చోటు కల్పించలేదు. ఎన్నికల ప్రచారంలో నాడు మంత్రి పదవి ఇస్తామనని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని వదిలేశారు. మంత్రి పదవిదక్కలేదన్న అసంతృప్తితో ఆళ్ల రామకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.తర్వాత మళ్లీ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి తిరిగి వైసీపీ లోకి వస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దూకుడుగా ఉండే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ ఓటమి తర్వాత నోటికి తాళం వేసుకున్నారు.
అందుకే మౌనంగా...
ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడుపై అనేక కేసులు వేశారు. సుప్రీం కోర్టు వరకూ వెళ్లారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో తనను అరెస్ట్ చేస్తారేమోనని భావించి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని తెలిసింది. అదే సమయంలో ఈసారి మంగళగిరి సీటు కాకుండా ఈసారి సత్తెనపల్లి సీటును ఇవ్వాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్ ను కోరినట్లు సమాచారం. సత్తెనపల్లి అయితే తాను ఖచ్చితంగా గెలుస్తానని నమ్మకంగా జగన్ తో ఆళ్ల చెబుతున్నారు. అయితే అక్కడ అంబటి రాంబాబు ఉండటంతో ఆయనకు జగన్ పూర్తిగా హామీ ఇవ్వలేదని, అందుకే ఆళ్ల రామకృష్ణారెడ్డి కామ్ గా ఉంటున్నారని, ఈసారి ఎన్నికల్లో ఇస్తే సత్తెనపల్లి లేకుంటే ఎన్నికల్లో పోటీ చేయబోనని తెగేసి చెప్పినట్లు వైసీపీలోనూ పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. మరి చివరకు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి.