Ys Jagan : నుదుటన సింధూరంతో జగన్.. అసలు కథ ఇదేనట
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నుదుటన బొట్టుతో పార్టీ నేతలతో జరుగుతున్న సమావేశంలో కనిపించడం అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నుదుటన బొట్టుతో పార్టీ నేతలతో జరుగుతున్న సమావేశంలో కనిపించడం అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది. సహజంగా ఏదైనా పండగకో, ఆలయాలకో వెళ్లినప్పుడు మాత్రమే నుదుటన జగన్ తిలకం దిద్దుకుని గతంలో కనిపించారు. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లినప్పుడు తిరునామాలు ధరించారు. అయితే ఈరోజు పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో నుదుటన బొట్టుతో కనిపించడం నేతలను సయితం ఆశ్చర్యపరిచింది. ఏదైనా ఆలయానికి వెళ్లినప్పుడో, లేక పూజలు నిర్వహించినప్పుడో ఇటువంటి సింధూరం నుదుటున పెట్టుకుంటారు. కానీ జగన్ ఈరోజు ఎటువంటి ఆలయానికి వెళ్లలేదు. అదే సమయంలో పూజలు కూడా జగన్ తన ఇంట్లో చేయరు.
ఎలా వచ్చిందన్న దానిపై...
మరి జగన్ నుదుట ఈ సింధూరం ఎలా వచ్చిందన్న దానిపై వైసీపీ సీనియర్ నేతలు ఆరా తీసినట్లు తెలిసింది. ఇటీవల జగన్ జిల్లాల పర్యటన సందర్భంగా ఆయన భద్రతపై అనేక అనుమానాలు తలెత్తాయి. పోలీసులు కనీసం రోప్ పార్టీలు కూడా ఏర్పాటు చేయడం లేదు. జగన్ అభిమానులు, ప్రజలు, కార్యకర్తల మధ్యనే పర్యటనలు చేస్తున్నారు. పొదిలి, రెంటపాళ్ల, బంగారుపాళ్ల్యం పర్యటనల్లో కూడా పోలీసులు తమ అధినేతకు తగిన భద్రత కల్పించడం లేదన్న ఆరోపణలను వైసీపీ నేతలు బహిరంగంగా చేస్తున్నారు. జగన్ భద్రతపై ఆందోళన ఉందని, ఆయన పర్యటనల్లో జడ్ ప్లస్ భద్రతతో పాటు రోప్ పార్టీని కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
మంగళవారం కావడంతో...
ఈ నేపథ్యంలోనే జగన్ ఈరోజు సమావేశానికి వచ్చే ముందు ఒక వైసీపీ మహిళ నేత జగన్ నుదుటన ఈ సింధూరం దిద్దినట్లు సమాచారం. ఈరోజు ఆంజనేయ స్వామికి ఇష్టమైన మంగళవారం కావడంతో పూజలు చేయించి ఆ సింధూరాన్ని జగన్ నుదుటన ఆమె దిద్దినట్లు చెబుతున్నారు. ఆ బొట్టుతోనే జగన్ సమావేశానికి హాజరయినట్లు చెబుతున్నారు. వైసీపీ మహిళ నేత పెట్టిన బొట్టుతో అలాగే పొలిటికల్ అడ్వయిజరీ సమావేశానికి వచ్చిన జగన్ ను చూసి తొలుత ఆశ్చర్యపోయినప్పటికీ తర్వాత అసలు విషయం తెలుసుకున్నారట. ఈ నెల 31వ తేదీన జగన్ నెల్లూరు పర్యటన నేపథ్యంతో పాటు లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ చేస్తారన్న ప్రచారంతో జగన్ నుదుటన ఈ సింధూరాన్ని దిద్దినట్లు తెలిసింది.