Ys Jagan : బాబు ష్యూరిటీ.. మోసానికి గ్యారంటీ.. ఎవరి చొక్కా పట్టుకోవాలి?
హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకూ అమలు చేయలేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు.
బాబు ష్యూరిటీ.. భవిష్యత్ కు గ్యారంటీ అని ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకూ అమలు చేయలేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బటన్ నొక్కడం పెద్ద పనా? ముసలావిడ కూడా నొక్కుతుందని చెప్పిన చంద్రబాబు దానిని నొక్కలేకపోతున్నారన్నారు. బాబు ష్యూరిటీ.. మోసానికి గ్యారంటీ అన్న రీతిలో తయారైందన్నారు. రొటీన్ గా కథలు చెప్పడమే తప్ప ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. హామీలకు గ్యారంటీ అంటూ ఇంటింటికీ బాండ్లను కూడా పంపించారని ఎద్దేవా చేశారు. అమలు చేయలేకపోతే చొక్కాలు పట్టుకుని నిలదీయమన్న కూటమి నేతలను ఇప్పుడు ఏం చేయాలని జగన్ ప్రశ్నించారు. ఇప్పుడు ఎవరి చొక్కా పట్టుకోవాలి? అని జగన్ నిలదీశారు.
1.40 కోట్లు అప్పులు చేసి...
80,820 కోట్ల రూపాయలు ఈ తొమ్మిది నెలల్లోనే ఈ ప్రభుత్వం చేసిందన్నారు. అమరావతి పేరుతో మరో యాభై వేల కోట్ల రూపాయలు అప్పులు చేయడానికి సిద్ధంగా ఉందని జగన్ అన్నారు. చేసిన అప్పులు, చేయబోయిన అప్పులు, మార్క్ ఫెడ్, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ద్వారా ఎనిమిది వేల కోట్ల రూపాయలు అన్నీ కలిపితే లక్షా నలభై వేలకోట్ల రూపాయలు చేసిందన్నారు. సూపర్ సిక్స్ లేదని, తాము గతంలో ఇచ్చిన పథకాలను కూడా అమలు చేయలేదని జగన్ అన్నారు. అమ్మవొడి పాయె.. వసతి దీవెన పాయె... ఫీజు రీఎంబర్స్ మెంట్ పాయె.. అంటూ జగన్ ఎద్దేవా చేశారు. వాహనమిత్ర, నేతన్నల నేస్తం, కాపు నేస్తం, లా నేస్తం వంటి గత పథకాలన్నీ ఆపేశారని జగన్ మండిపడ్డారు. మరి 1,40 లక్షల కోట్ల అప్పులు ఎవరి జేబుల్లోకి పోతున్నాయని జగన్ ప్రశ్నించారు.
సంపద సృష్టించడమంటే...
వాలంటీర్లను ఎలా మోసం చేశారో.. ప్రభుత్వ ఉద్యోగులను కూడా అలాగే మోసం చేస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. పదిహేడు మెడికల్ కళాశాలలను ప్రయివేటుకు అప్పగించాలని ఈ ప్రభుత్వం సిద్ధమయిందన్నారు. పేదలకు ఉచిత వైద్యం కూడా అందించే వాటిని ప్రయివేటు పరంచేస్తుందని జగన్ అన్నారు. తమ హయాంలో పోర్టులను నిర్మించామని చెప్పారు. తొమ్మిదినెలల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు రికార్డులు బద్దలు కొట్టాయని అన్నారు. గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగులను కూడా మోసం చేశారన్నారు. ప్రతి నెల ఒకటో తేదీన జీతం ఎప్పుడు ఇచ్చారో చెప్పాలంటూ జగన్ అన్నారు. సంపద సృష్టించడమంటే తన వారి ఆస్తులను పెంచుకోవడమే నని జగన్ మండి పడ్డారు. రూపాయి ఆదాయం లేకపోగా, ఇసుక ధర డబల్ అయిందన్నారు. చంద్రబాబు నాయుడు జేబులో సంపద సృష్టి జరుగుతుందన్నారు. ఆదాయం ఆవిరి అయిందన్నారు.
మద్యం సిండికేట్లతో...
ఢిల్లీలో లిక్కర్ పాలసీ అమలు చేసి అరవింద్ కేజ్రీవాల్ జైలుకెళ్తే, ఇక్కడ మాత్రం యధేచ్ఛగా మద్యం దందాను చంద్రబాబు ప్రభుత్వం నడుపుతుందన్నారు. అయినా ఈయన గారిపై కేసులు లేవన్నారు. ఎమ్మెల్యేలు మద్యం దుకాణాలను సొంతం చేసుకున్నా అడిగేవారు లేరని జగన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం తగ్గుతుందని, చంద్రబాబు జేబులో ఆదాయం పెరుగుతుందని అన్నారు. మద్యం, ఇసుక, ఫ్లై యాష్ మాఫియాలు పెదబాబు, చిన బాబు ఆధ్వర్యంలో నడుపుతున్నారన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ పేకాట క్లబ్ లు నడుపుతున్నారని జగన్ ఆరోపించారు. నియోజకవర్గంలో ఏం జరగాలన్నా ఎమ్మెల్యేల అనుమతి తీసుకోవాల్సిందేనని జగన్ అన్నారు.