Ys Jagan : టెన్షన్ మధ్య జగన్ నెల్లూరు పర్యటన... పోలీసు ఆంక్షలు బేఖాతరు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నెల్లూరుకు చేరుకున్నారు. అయితే పోలీసులు పెట్టిన ఆంక్షలను బేఖాతరు చేస్తూ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలి వచ్చారు

Update: 2025-07-31 06:20 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నెల్లూరుకు చేరుకున్నారు. అయితే పోలీసులు పెట్టిన ఆంక్షలను బేఖాతరు చేస్తూ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలి వచ్చారు. హెలికాప్టర్ లో నెల్లూరుకు చేరుకున్న జగన్ నేరుగా సెంట్రల్ జైలుకు వెళ్లి మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిని కలుసుకున్నారు. హెలిప్యాడ్ వద్ద నుంచి అనేక ప్రాంతాల్లో జనం గుమికూడారు. జైల్లోకి జగన్ తో సహా ముగ్గురిని మాత్రమే అనుమతించారు. అనంతరం వైఎస్ జగన్ నెల్లూరు నగరంలోని మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి బయలుదేరి వెళ్లారు.

ప్రసన్న భైఠాయింపు...
వేదాయపాలెం, కరెంట్ ఆఫీస్ సెంటర్, ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో పెద్ద సంఖ్యలో జనం చేరడంతో పోలీసులు వారిని పంపించి వేస్తున్నారు. మరో వైపు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిని పోలీసులు తోసేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమ కార్యకర్తలను అన్యాయంగా కొట్టారని, స్వచ్ఛందంగా ప్రజలు తరలివస్తుంటే అడ్డుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపించారు. ప్రజలపై కూడా పోలీసులు లాఠీఛార్జ్ చేస్తున్నారన్నారు. జనం రాకుండా రోడ్లు తవ్వేశారని, వైఎస్ జగన్ అభిమానులను ఎవరూ ఆపలేరని మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు.
నిబంధనలు అతిక్రమించారంటూ...
పోలీసుల జులం నశించాలని వైసీపీ శ్రేణులు పెద్దయెత్తున నినాదాలు చేశారు. వైసీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్ చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిబంధనలను అతిక్రమించినందుకు గాను పోలీసులు నేతలు, కార్యకర్తలపై కేసు నమోదు చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే జిల్లా ఎస్సీ హెచ్చరికలు జారీ చేయడంతో నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అయితే ఎన్ని కేసులయినా పెట్టుకోమంటూ వైసీపీ నేతలు ప్రతిగా సమాధానమిస్తున్నారు.


Tags:    

Similar News