CM Ramesh : అనకాపల్లి టు ఫోర్త్ సిటీ.. తెలంగాణలో సెంటిమెంట్ పాలిటిక్స్
అనకాపల్లి బీజేపీ పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్ కు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది
అనకాపల్లి బీజేపీ పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్ కు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. కౌంటర్లు ప్రతి కౌంటర్లు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ మరోసారి తెలంగాణ సెంటిమెంట్ రాజకీయాలను తీసుకు వచ్చి మరోసారి అధికారం చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనపడుతుంది. మరొకవైపు ఈ వివాదంలో పారిశ్రామికవేత్త, కాంట్రాక్టరు సీఎం రమేష్ పేరు తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చింది. వాస్తవానికి సీఎం రమేష్ టీడీపీలో ఆది నుంచి కొనసాగుతూ 2019 ఎన్నికల తర్వాత బీజేపీలో చేరిపోయారు. ఇప్పటి వరకూ సీఎం రమేష్ నాయుడు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయలేదు. రాజ్యసభ సభ్యుడిగానే ఎన్నికయ్యారు.
ఇతర రాష్ట్రాల్లో చేసే సంస్థగా....
తొలిసారిగా సీఎం రమేష్ బీజేపీ అభ్యర్థిగా కడప నుంచి కాకుండా అనకాపల్లి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం అనకాపల్లి బీజేపీ ఎంపీగా ఉన్న సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ కనస్ట్రక్షన్ అటు ఆంధ్రప్రదేశ్ లోనూ, ఇటు తెలంగాణలోనూ అనేక కాంట్రాక్టులు చేపట్టినట్లు చెబుతున్నారు. ఏపీలో పనులు చేపడితే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ తెలంగాణలో పనులు చేపట్టడంతోనే వివాదానికి కారణమయింది. నిజానికి ఏ1 కాంట్రాక్టు సంస్థ రాష్ట్రాలతో సంబంధం లేకుండా ఎక్కడైనా పనులు చేపట్టవచ్చు. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లో కూడా తెలుగు వారికి చెందిన కాంట్రాక్టు సంస్థలు పనులు చేపట్టాయి.
టెండర్లు దక్కించుకుని...
ఎందుకంటే టెండర్లు దక్కించుకుని ఎక్కడైనా ఏ సంస్థ అయినా పనులు చేపట్టే అవకాశముంటుంది. కానీ తెలంగాణ విషయానికి వచ్చేసరికి కొంత తేడా వస్తుంది. 2014 కు ముందు వరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న ప్రాంతం రెండుగా విడిపోవడంతో సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుంది. ఏపీ రాజకీయ పార్టీలు, తెలంగాణ పొలిటికల్ పార్టీలుగా విడిపోయాయి. అందుకే ఇప్పుడు సీఎం రమేష్ అంశం తెలంగాణలో వివాదంగా మారింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో సీఎం రమేష్ ప్రమేయం ఉందని కేటీఆర్ ఆరోపించడంతో పాటు ఫోర్త్ సిటీలోనూ పదహారు వందల కోట్ల రూపాయల పనులు తీసుకున్నారని అనడంతో రగడగా మారింది.
నిబంధనల మేరకేనని...
తెలంగాణ ప్రాంతంలో బీజేపీ ఎంపీ, మొన్నటి వరకూ టీడీపీలో ఉన్న సీఎం రమేష్ ఆ పనులను దక్కించుకోవడాన్ని కేటీఆర్ తప్పు పడుతున్నారు. ఏపీకి చెందిన టీడీపీ నేతలు, బీజేపీ నేతలతో రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధాలను గురించి తెలంగాణ ప్రజలకు తెలియజెప్పడంలో భాగంగా సీఎం రమేష్ ను బయటకు తీసుకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే సీఎం రమేష్ కూడా కేటీఆర్ పై విరుచుకుపడ్డారు. బీజేపీలో విలీనం చేయడానికి కేటీఆర్ ప్రయత్నం చేశారంటూ ఆయన చెప్పి దీనికి కౌంటర్ ఇచ్చారు. ఇలా సెంటిమెంట్ తో గులాబీ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తుండగా, సీఎం రమేష్ మాత్రం నిబంధనల ప్రకారమే తనకు దక్కినట్లు పరోక్షంగా ఒప్పుకోవడం ఇక్కడ విశేషం. మొత్తం మీద మరోసారి సెంటిమెంట్ రాజకీయాలు సీఎం రమేష్ కాంట్రాక్టు రూపంలో బయటకు వచ్చినట్లు కనిపిస్తున్నాయి. మరి అవి ఏ మేరకు పనిచేస్తాయన్నది చూడాల్సి ఉంది.