Vallabhaneni Vamsi : అండర్ గ్రౌండ్ లోకి వైసీపీ నేత వల్లభనేని వంశీ
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు కావడంతో గత కొన్ని రోజుల నుంచి ఆయన ఆచూకీ దొరకడం లేదు. వల్లభనేని వంశీ కోసం ఏపీ పోలీసులు బృందాలుగా విడిపోయి బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉందని తెలియడంతో అక్కడకు వెళ్లారు. వల్లభనేని వంశీ పై ఇటీవల హత్య కేసు నమోదయిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల సమయంలో తనపై వల్లభనేని వంశీ ఆయన అనుచరులతో కలిసి తనపై హత్యకు కుట్ర చేశారంటూ గత నెల 17వ తేదీన మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వల్లభనేని వంశీ తో పాటు మరొక ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు.
కొన్ని రోజుల నుంచి అదృశ్యం...
మళ్లీ హత్యాయత్నం కేసులో పోలీసులు తనను అరెస్ట్ చేస్తారని తెలిసి వల్లభనేని వంశీ గత కొన్ని రోజుల నుంచి కనిపించడం లేదు. ఇటీవల కొన్ని కేసులలో విజయవాడ జైల్లో వల్లభనేని వంశీ దాదాపు 140 రోజులకు పైగానే జైలు జీవితం గడిపారు. ఆయన ఆరోగ్యం కూడా క్షీణించింది. అనేక సార్లు వైద్య పరీక్షల నిమిత్తం రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీని ఆసుపత్రికి తీసుకు వచ్చి పరీక్షలు చేయించారు. చివరకు అన్ని కేసుల్లో వల్లభనేని వంశీ కి బెయిల్ రావడంతో ఆయన బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. గన్నవరం నియోజకవర్గంలోనే ఉంటూ వైసీపీ కార్యకర్తలతో ఆయన అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
మరొక కేసు నమోదు కావడంతో...
ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ పై మరొక కేసు నమోదు కావడంతో ఆయన అదృశ్యంలోకి వెళ్లి తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఎన్నికల అఫడవిట్ లో వల్లభనేని వంశీ పై దాదాపు ఇరవై మూడు కేసులు నమోదయ్యాయని ప్రభుత్వ తరుపున న్యాయవాదులు తెలిపారు. కానీ వంశీ న్యాయవాదులు మాత్రం ఎన్నికలకు ముందు కేవలం మూడు కేసులు మాత్రమే ఉన్నాయని, ఇటీవల కాలంలో వరసగా మరో 20కి పైగా కేసులు నమోదు చేశారని చెప్పారు. అందుకు ఎన్నికల అఫడవిట్ ను న్యాయస్థానం ముందు పెట్టాలని హైకోర్టు ఆదేశించి తదుపరి విచారణ ఈ నెల 2వ తేదీకి వాయిదా వేసింది. కానీ వల్లభనేని వంశీ కోసం పోలీసులు వెతుకుతున్నారు. రేపు విచారణ జరుగుతున్న సందర్భంలో వల్లభనేని వంశీ పోలీసులకు చిక్కుతాడా? లేదా? అన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.