YSRCP : ట్రాక్ రికార్డు చూస్తే .. భయమేస్తుంది.. పార్టీ మారితే గెలుస్తామా? లేదా?
వైసీపీ ఎమ్మెల్యే పార్టీ మారతారన్న చర్చజరుగుతుంది. అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం ఊగిసలాటలో ఉన్నారని తెలిసింది
వైసీపీ ఎమ్మెల్యే పార్టీ మారతారన్న చర్చజరుగుతుంది. గత 2024లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ గెలిచిన పదకొండు స్థానాల్లో అరకు నియోజకవర్గం ఒకటి. అయితే అరకు నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే మత్స్యలింగం పార్టీని వీడతారన్న ప్రచారం జరుగుతుంది. కానీ ఆ ప్రచారం ఎంత మేరకు నిజం అన్నది మాత్రం తెలియడం లేదు. ఇంకా శాసనసభ ఎన్నికలకు మూడున్నరేళ్ల సమయం ఉంది. అయితే ఇప్పుడు పార్టీ మారితే తన రాజకీయ భవిష్యత్ ఏంటన్న దానిపై కూడా ఆయన సమాచాలోచనలు జరుపుతున్నారని తెలిసింది. అరకు నియోజకవర్గం ట్రాక్ రికార్డు చూస్తే పార్టీ మారి పొలిటికల్ ఫ్యూచర్ ను తనకు తానే ఇబ్బందుల్లోకి నెట్టేసుకోవడం ఎందుకన్న ఊగిసలాటలో కూడా ఉన్నారు.
పార్టీ మారిన వాళ్లు ఎవరూ...
అరకు నియోజకవర్గం ఏర్పాటయిన తర్వాత తొలిసారి 2009 లో మాత్రమే అక్కడ టీడీపీ గెలిచింది. ఎస్టీ నియోజకవర్గం కావడంతో అక్కడ 2009లో సివేరి సోమ గెలుపొందారు. తర్వాత 2014లో కిడారి సర్వేశ్వరరావు వైసీపీ నుంచి విజయం సాధించారు. అయితే మావోయిస్టుల దాడిలో మరణించారు. తర్వాత ఆ కుటుంబం నుంచి ఎవరిని అరకు నియోజకవర్గ ప్రజలు ఆదరించలేదు. కిడారి శ్రావణకుమార్ ను మంత్రిని చేసి తర్వాత వారికి రాజకీయ జీవితం లేదు. కిడారి సర్వేశ్వరరావు కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి మారారు. ఇప్పటి వరకూ ఆ కుటుంబం రాజకీయంగా ఎదగలేకపోయింది. 2019, 2024 ఎన్నికల్లోనూ వైసీపీ అక్కడ గెలిచింది. 2019లో చెట్టి ఫాల్లుణ, 2024లో రేగం మత్స్యలింగం వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
పార్టీ మారితే.. కష్టమేనా?
ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉంటుంది. సహజంగా అధికార పార్టీపై వచ్చే ఎన్నికల్లో వ్యతిరేకత తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పుడు పార్టీ మారి రాజకీయ భవిష్యత్ ను తనకు తానుగా సమాధి చేసుకోవడం ఎందుకన్న ఆలోచనలో ఆయన ఉన్నట్లు కనపడుతుంది. అయితే వైసీపీ పిలుపు నిచ్చిన కార్యక్రమాలకు దూరంగా ఉండటం మాత్రం చర్చనీయాంశమైంది. అందుకే ఆయన పార్టీ మారతారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ ప్రచారాన్ని కూడా ఆయన ఖండించకపోవడం మరింత ప్రచారానికి ఊతమిస్తుంది. గిరిజనుల్లో జనసేన నేత దూసుకు వెళుతుండటంతో తనకు ప్లస్ గా మారి వచ్చే ఎన్నికల్లో గెలుపు అవకాశాలుంటాయన్న అంచనాలు కూడా ఆయన వేసుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం సన్నిహితులు చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?