Ys Jagan : వైఎస్ జగన్ ఆ పని ఎందుకు చేస్తారు? రాజకీయం ఆయనకు తెలియదా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది.

Update: 2025-07-27 09:05 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. లిక్కర్ స్కామ్ కేసులో వరసగా అరెస్ట్ లు జరుగుతుండటంతో పాటు తనకు అత్యంత ఆప్తులైన వారిని జైల్లోకి పంపుతుండటంతో వైఎస్ జగన్ ముఖ్యమైన నిర్ణయం వైపుగా అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో పన్నెండు మంది అరెస్టయ్యారు. అందులో తన కార్యాలయంలో పనిచేసిన ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డితో పాటు తనకు అత్యంత ఆప్తులైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అరెస్ట్ కావడంతో మనస్తాపం చెందిన వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది.

ఢిల్లీకి వెళతారంటూ...
అందులో ఒక ప్రచారానికి వస్తే త్వరలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్లి బీజేపీ నేతలను కలసి ఏపీ లిక్కర్ స్కామ్ విషయంపై చర్చిస్తారంటున్నారు. 2014 నుంచి 2019 వరకూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎక్సైజ్ శాఖకు మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని, తాను అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో 2019 నుంచి 2024 వరకూ వచ్చిన ఎక్సైజ్ ఆదాయంపై బీజేపీ నేతలకు వివరించే అవకాశముందని ప్రచారం జరుగుతుంది. అయితే జగన్ ఇప్పట్లో ఢిల్లీ వెళ్లే అవకాశాలు లేవని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీకి వెళ్లి ఎవరినీ కలిసే ఉద్దేశ్యం లేదని, మద్యం కేసును న్యాయపరంగానే ఎదుర్కొనేందుకు జగన్ సిద్ధమవుతున్నారని అంటున్నారు.
రాజీనామాలు కూడా...
దీంతో పాటు మరో ముఖ్యమైన ప్రచారం జరుగుతుంది. వైసీపీ నేతలపై అక్రమ కేసులు, అరెస్ట్ లకు నిరసనగా వైసీపీ శాసనసభ్యులందరితోనూ రాజీనామా చేయిస్తారన్న ప్రచారం జరుగుతుంది. తనతో పాటు గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలందరి చేత రాజీనామా చేయించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సోషల్ మీడియాలో పెద్దయెత్తున కథనాలు వెలువడుతున్నాయి. అయితే గతంలో మాదిరిగా ఇప్పుడు రాజీనామాల అస్త్రాల ప్రయోగం జగన్ చేయరన్నది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. గెలిచిన నియోజకవర్గాల నుంచి రాజీనామాలు చేసి తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేయడం అంటే ప్రజలలో ఒకరకమైన వ్యతిరేక భావన ఏర్పడుతుందని భావిస్తున్నారు.
ఇప్పుడు వర్క్ అవుట్ కాదని...
నాడు సెంటిమెంట్ కారణంగా రాజీనామాలు చేస్తే వర్కవుట్ అయ్యాయి. కానీ ఇప్పుడు అరెస్ట్ లను సాకుగా చూపి రాజీనామాలు చేయించినంత మాత్రాన జరిగేదేమీ లేదన్న విషయం జగన్ కు తెలియంది కాదు. ఉప ఎన్నికల్లో ఈసారి గెలుపు కూడా కష్టమే అవుతుంది. సెంటిమెంట్ లేకపోగా, సానుభూతి రాకపోగా అసలుకే ఎసరు వచ్చి ప్రస్తుతం పార్టీకి ఉన్న హైప్ కూడా పోతుందని ఆయన గట్టిగా భావిస్తున్నారు. అందుకే కేసులకు భయపడి ఢిల్లీ పెద్దల వద్దకు వెళ్లి సాగిలపడటం, అలాగే ఉన్న ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించడం జరగదని వైసీపీకి చెందిన సీనియర్ నేత ఒకరు చెప్పారు. అవన్నీ ప్రచారం మాత్రమేనని, వాస్తవానికి దూరంగా అటువంటి విశ్లేషణలు ఉన్నాయని చెబుతున్నారు.




Tags:    

Similar News