Tirumala : తిరుమలకు వచ్చేభక్తులు నేడు రెండు కిలోమీటర్లకు అవతలే
తిరుమలలో భక్తుల రద్దీ నేడు ఎక్కువగా ఉంది
తిరుమలలో భక్తుల రద్దీ నేడు ఎక్కువగా ఉంది. కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. శుక్రవారం కావడంతో సహజంగానే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇటీవల కాలంలో తిరుమలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. గతంలో ఒక సీజన్ కు మాత్రమే పరిమితమయ్యే రద్దీ నేడు ఎప్పుడు వీలయితే అప్పుడు అన్నట్లు భక్తులు బారులు తీరున్నారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కూడా భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
సీజన్ తో సంబంధం లేకుండా...
తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతుంది. గతంలో అన్ సీజన్ అనేది ఒకటుండేది. ఇప్పుడు అదేమీ లేదు. సీజన్.. అన్ సీజన్ తో సంబంధం లేకుండా భక్తులు తరలి వస్తున్నారు. దీంతో శ్రీవారి హుండీ ఆదాయం కూడా పెరుగుతోంది. మరొకవైపు అన్నదాన సత్రంలో వండి వడ్డించాలంటే గ్యాస్ కొరతతో కొంత ఇబ్బందులవుతున్నా వచ్చిన ప్రతి ఒక్కరికీ అన్న ప్రసాదాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అందిస్తున్నారు.
అన్ని కంపార్ట్ మెంట్లు నిండి...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట శిలాతోరణం వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 57,272 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,842 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.37 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.