TDP : ఏంటో అనుకుంటాం కానీ.. అందరూ సవ్యంగా ఉంటారా ఏంటి?
తెలుగుదేశం పార్టీకి ఈసారి ఏంటో కానీ అధినాయకుడు ఒకవైపు లాగుతుంటే.. ఎమ్మెల్యేలు మరొక వైపు లాగుతున్నారు
తెలుగుదేశం పార్టీకి ఈసారి ఏంటో కానీ అధినాయకుడు ఒకవైపు లాగుతుంటే.. ఎమ్మెల్యేలు మరొక వైపు లాగుతున్నారు. ముఖ్యంగా ఈ టర్మ్ లో మాత్రం టీడీపీని దారుణంగా నష్టపరుస్తుంది ఖచ్చితంగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే. ఎందుకంటే గతంలో ఇలాంటి పరిస్థితులు ఉండేవి కావు. తమ నియోజకవర్గంలో ఏదైనా సమస్యలున్నా అధినాయకత్వంతో చెప్పుకునే వారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. నాయకత్వం మాట పెడచెవిన పెట్టి తాము అనుకున్నది మీడియా ముందు చెప్పేస్తున్నారు. దీంతో టీడీపీకి భారీగా డ్యామేజీ అవుతుంది. తాజాగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరద రాజులు రెడ్డి కూడా అలాంటి కోవలోకి వెళ్లినట్లే కనిపిస్తుంది. అసలే రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుందని వైసీపీ చేస్తున్న విమర్శలకు వరదరాజులు రెడ్డి వంత పాడినట్లుంది.
పోలీసులపై విమర్శలు...
ప్రొద్డుటూరులో బంగారం వ్యాపారాలకు కొదవలేదు. బంగారం దుకాణాలు లెక్కకు మించి ఉన్నాయి. అయితే బంగారం వ్యాపారులను బెదరించి పోలీసులు ప్రయివేటు పంచాయతీలు చేస్తున్నారని సాక్షాత్తూ ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి పోలీసులపై ఫైర్ అవ్వడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. రాజకీయం కోసం బంగారం వ్యాపారులకు అండగా ఉండటంలో తప్పులేదు. కానీ అదే సమంయంలో ప్రభుత్వంలో ఉన్న సమయంలో పోలీసులపై నెగిటివ్ కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ హాట్ గా మారింది. బంగారు వ్యాపారి శ్రీనివాసులును అన్యాయంగా అరెస్ట్ చేశారని, ఏడు కోట్ల రూపాయల అప్పు వసూళ్లలో పోలీసులు ప్రమేయం ఉందని వరద రాజులు రెడ్డి చెప్పారు.
ప్రయివేటు పంచాయతీలంటూ...
తమ విధులను మానేసి ప్రయివేటు పంచాయతీలు చేయడం, సివిల్స్ తగాదాల్లో తలదూర్చడమేంటని అధికార పార్టీ ఎమ్మెల్యేనే ప్రశ్నించడం ఇప్పుడు వైసీపీకి కలసి వచ్చింది. పోలీసుల వ్యవహార శైలిని టీడీపీ ఎమ్మెల్యేలే తప్పుపడుతున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఇక వైసీపీ సంగతి పక్కన పెడితే అసలు అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా జరిగితే అది ఉన్నతాధికారుల దృష్టికో, జిల్లా ఇన్ ఛార్జి మంత్రికో చెప్పి పరిష్కరించుకోవాలని, లేకుంటే హైకమాండ్ ను సంప్రదించాలని, అంతేకాని ఇలా మీడియా సమావేశాలు పెట్టి పోలీసుల తీరును విమర్శించడం కేవలం హోం మంత్రిత్వ శాఖకు మాత్రమే కాదు...చంద్రబాబు సర్కార్ పైన కూడా పడుతుందన్నది ఈ పెద్దాయనకు తెలియదా? అంటే తెలుసు. ఎందుకు తెలియదు. అయినా అన్నారంటే డోన్ కేర్ అన్నమాటేగా.