TDP : బాబు వార్నింగ్ లు పనిచేయడం లేదా? ఎమ్మెల్యేలు ఎందుకిలా?
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వరస వివాదాల్లో చిక్కుకోవడం పార్టీని ఇబ్బందుల పాలు చేస్తుంది
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వరస వివాదాల్లో చిక్కుకోవడం పార్టీని ఇబ్బందుల పాలు చేస్తుంది. పార్టీతో పాటు ప్రభుత్వాన్ని కూడా ఇరకాటంలోకి నెడుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్ని వార్నింగ్ లు ఇచ్చినా పెద్దగా పనిచేయడం లేదు. తమ నియోజకవర్గంలో తమ మాట చెల్లుబాటు కావాలన్న ఏకైక లక్ష్యంతోనే ఎమ్మెల్యేలు ముందుకు సాగుతూ పార్టీ ప్రయోజనాలను పణంగా పెడుతున్నారు. తాజాగా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు కూడా ఆ జాబితాలో చేరిపోయారు. ఆయన కూడా తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై వరస వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు.
చంద్రబాబు సీరియస్...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చదలవాడ అరవిందబాబు విషయంలో సీరియస్ అయినట్లు తెలిసింది. టెన్షన్ ఉంటే మెడిటేషన్ చేయాలని ఎమ్మెల్యేలకు సూచించారు . అదుపు తప్పితే ఎలా? బాధ్యతగా ఉండాలంటూ సీఎం క్లాస్ పీకారు. కొంతమంది ఎమ్మెల్యేలు కంట్రోల్ తప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు నిన్న మా ఎమ్మెల్యే ఒకరు వెళ్లి వేరే ఆఫీసు మీద పడ్డారని, ఆఫీసుల మీద పడటం ఏంటి? పద్ధతి మార్చుకోవాలంటూ సీరియస్ అయ్యారు. క్రైమ్ సీరియల్స్ చూసి కంట్రోల్ తప్పుతున్నారని, సీరియల్ చూసి మనసు పాడు చేసుకోవద్దు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రసరావుపేట తెదేపా ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు వ్యవహారాన్ని పార్టీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. పల్నాడు ఎస్పీ కార్యాలయంలో ఆయన వ్యవహార శైలిపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన నుంచి వివరణ తీసుకోవాలన్నారు. బుధవారం తెదేపా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఫోన్ చేసినా.. అరవిందబాబు ఎత్తలేదు. పల్లాకు ఫోన్ చేసి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే, వ్యక్తిగతంగా వచ్చి లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని పల్లా ఆదేశించారు.
అసలు ఏం జరిగిందంటే?
చదలవాడ అరవింద బాబు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. పది గంటల పాటు ఎస్పీ ఛాంబర్ లో బైఠాయించారు. పల్నాడు జిల్లా పోలీసు సెల్ న్యాయ సలహాదారుగా తాను సూచించిన వారి పేరును ఎందుకు ఆమోదించలేదంటూ ఎస్పీని నిలదీశారు. అంతటితో ఆగకుండా ఆర్డర్ కాపీ చేతిలో పెట్టే వారు తాను ఇక్కడి నుంచి కదలబోనని చెప్పారు. తలుపులు వేసుకుని కూర్చోవడంతో పోలీసులు బద్దలు కొట్టి ఎమ్మెల్యేను బయటకు తీసుకు రావాల్సి వచ్చింది. మంత్రులు లోకేశ్, అనిత కార్యాలయాల నుంచి ఫోన్లు వచ్చినా పట్టించుకోలేదు. మళ్లీ ఆర్టీవో కార్యాలయానికి వచ్చిన అరవిందబాబు తన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. అయితే ఎస్పీ ఆఫీసులో ఎలాంటి వివాదం జరగలేదని, కార్యకర్తల కోసం ఎంత దూరమైనా వెళతామని అరవింద బాబు తెలిపారు.