Chandrababu : Chandrababu : అమరావతి అలకగానే పండగ అవుతుందా? అసలు పండగ ఎప్పుడంటే?

రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించినంత మాత్రాన లాభం లేదు

Update: 2026-04-02 07:58 GMT

రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించినంత మాత్రాన లాభం లేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యంగా ఈ మూడేళ్ల కాలంలో పనులు వేగంగా చేపట్టేందుకు అధికారుల వెంట పడాలి. కాంట్రాక్టర్లను బెత్తం పుచ్చుకుని మరీ తరమాలి. అప్పుడే అమరాతికి ఒక రూపు రానుంది. ఇప్పటికే అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులకు ప్రభుత్వం పై విశ్వాసం క్రమంగా సన్నగిల్లుతుంది. రాజధాని నిర్మాణమంటూ తమ వద్ద నుంచి భూములను సేకరించి పదేళ్లవుతున్నా ఇప్పటి వరకూ తమకు ప్లాట్లు కేటాయించలేదన్న అసంతృప్తిలో ఉన్నారు. వారికి సత్వరం ప్లాట్లను కేటాయించాలి.

రైతుల్లో భరోసా కల్పించిన నాడే...
కేవలం ప్లాట్లను కేటాయించడమే కాకుండా అభివృద్ధి చేసిన ప్లాట్లను వారికి అందివ్వాల్సి ఉంటుంది. మౌలిక సదుపాయాలు కల్పించి వారికి ప్లాట్లు ఇవ్వగలిగితే రైతుల్లో కొంత భరోసా ఏర్పడుతుంది. తాజాగా రెండో విడత భూ సమీకరణ అని నోటిఫికేషన్ వెలువడిన వెంటనే రాజధాని ప్రాంతంలో భూముల ధరలు పడిపోయాయని రైతులు వాపోతున్నారు. కేవలం రాజధాని ప్రాంతంలోని భూములకు మాత్రమే ఈ ఎఫెక్ట్ పడలేదు. పొరుగున ఉన్న గుంటూరు పట్టణంపై కూడా ఈ ప్రభావం పడిందని చెబుతున్నారు. మరో యాభై వేల ఎకరాలు సేకరిస్తే తమ భూములను కొనుగోలు చేసేవారు ఎవరన్న ప్రశ్న ఆ ప్రాంత రైతుల్లో ఉంది.
అమరావతి నామస్మరణం చేస్తూ...
మరొకవైపు కేవలం రాజధాని అమరావతి నామస్మరణం చేస్తూ వెళితే రాజకీయంగా కూటమి ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు. గత ఎన్నికల్లో రాజధాని అమరావతి వల్లనే తమకు మూడు ప్రాంతాల నుంచి మద్దతు దొరికిందని భావించడం అతి విశ్వాసమే అవుతుంది. ఎందుకంటే ఏ ప్రాంత వాసికైనా తమ ప్రాంతమైన కొంత మమకారం ఉంటుంది. లక్షల కోట్లు ఒకచోట ఖర్చు పెడుతూ ఉంటే కడుపు తరుక్కుపోయి మిగిలిన ప్రాంత ప్రజలు వ్యతిరేకమయ్యే అవకాశముంది. అందుకే చంద్రబాబుకు అమరావతి నిర్మాణం అది పెద్ద సవాల్ అని చెప్పాలి. మరి అమరావతి అందలమెక్కిస్తుందని భావించినా అది ఒక్కోసారి ముంచే ప్రమాద ముందన్న విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి.


Tags:    

Similar News