Chandrababu : దొంగఓట్లు వేస్తారు జాగ్రత్త తమ్ముళ్లూ.. దానిని అడ్డుకోండి

వైసీపీ నేతలు దొంగ ఓట్లు వేసుకోవడానికి ప్రయత్నిస్తారని దానిని అడ్డుకోవాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు.

Update: 2024-04-17 13:40 GMT

వైసీపీ నేతలు దొంగ ఓట్లు వేసుకోవడానికి ప్రయత్నిస్తారని దానిని అడ్డుకోవాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు. పెడనలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఇక్కడ ఉన్నవాళ్లు ఎవరైనా ఆనందంగా ఉన్నారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. అందరిని నట్టేట ముంచిన వ్యక్తి సైకో జగన్ అని అన్నారు. పదకొండు సర్వేల్లో పదిహేను నుంచి పదమూడు ఎంపీలు కూటమి గెలుస్తుందని అవి చెప్పాయన్నారు. ఐదేళ్లు పరదాలు కట్టుకుని తిరిగిన దుర్మార్గుడు ఇప్పుడు ఓట్ల కోసం మీ ముందుకు వస్తున్నాడన్నారు. ఒక ఛాన్స్ అంటూ.. బుగ్గలు నిమిరి.. ముద్దులు పెడితే కరిగిపోయారన్నారు. ఐదేళ్లు బాదుడే బాదుడుకు జనం అలసి పోయారన్నారు.

గులకరాయి డ్రామాతో...
బాబాయ్ ని గొడ్డలితో లేపేసింది ఎవరు తమ్ముళ్లూ అని అడుగుతున్నా అని చంద్రబాబు ప్రశ్నించారు. కోడికత్తి డ్రామా తో పాటు నిన్న గులకరాయి డ్రామా ఆడారని అన్నారు. ర్యాలీకి పిలిచి డబ్బులు ఇవ్వకపోతే గులకరాయి వేశానని నిందితుడు చెప్పాడన్నారు. తమ దగ్గర డబ్బులు లేవని, నిజాయితీ, నీతి ఉందని చంద్రబాబు అన్నారు. డబ్బులకు అమ్ముడు పోవద్దని అన్నారు. తాము ముగ్గురం కలసింది ప్రజల గెలుపు కోసమేనని చంద్రబాబు అన్నారు. విధ్వంసం, అహంకారంతో రాష్ట్రాన్ని నాశనం చేశారన్నారు. పట్టిసీమను పూర్తి చేసి డెల్టాకు నీళ్లు తెచ్చింది తెలుగుదేశం పార్టీ అని అన్నారు. తాము అధికారంలో ఉండి ఉంటే ఈ పాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదని అన్నారు.
పోలవరం, అమరావతిని...
ఈరోజు పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు దుర్మార్గుడంటూ చంద్రబాబు జగన్ పై మండి పడ్డారు. సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుందని, తద్వారా సంక్షేమ కార్యక్రమాలు అమలుచేయవచ్చన్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీ అందుకు ఉదాహరణ అని అన్నారు. మచిలీపట్నం - విజయవాడ నేషనల్ హైవే ఎవరి వల్ల వచ్చిందని ఆయన ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే పెడనలో పరిశ్రమలను స్థాపిస్తామని చెప్పారు. బందరుపోర్టు పూర్తయితే పెడన నుంచి ఎక్కడకు వెళ్లకుండానే ఇక్కడే ఉద్యోగాలు వస్తాయని అన్నారు. జగన్ సంక్షేమ పథకాలను అన్నింటినీ రద్దు చేసి నవరత్నాలన్నీ నవ మోసాలు చేసే పరిస్థితికి వచ్చాడన్నారు.


Tags:    

Similar News