TDP : టీడీపీ కేంద్ర కార్యాలయానిదే లోపమా? పట్టించుకోవడం లేదా?

తెలుగుదేశం పార్టీ కేంద్ర పార్టీ కార్యాలయం సక్రమంగా పనిచేయడం లేదా?

Update: 2025-10-07 07:22 GMT

తెలుగుదేశం పార్టీ కేంద్ర పార్టీ కార్యాలయం సక్రమంగా పనిచేయడం లేదా? పార్టీ కార్యాలయం వల్లనే పార్టీ ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడుతుందా? నేతల మధ్య సమన్వయం లేకపోవడానికి కూడా పార్టీ కేంద్ర పార్టీ కార్యాలయం అనుసరిస్తున్న మెతక వైఖరి అని చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు చేతుల్లోకి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత 1995 నుంచి ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ ఏం మాట్లాడాలన్నా అది ముందు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి సమాచారం ఇవ్వాల్సి ఉండేది. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ లో ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీడియా సమావేశం పెట్టాలన్నా, లేకపోతే అసెంబ్లీ సమావేశాల్లో ఏ విషయాలను అయినా ప్రస్తావించాలన్నా ముందుగా పార్టీ కేంద్ర కార్యాలయానికి సమాచారం అందించాల్సి వచ్చేది.

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఉండే...
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఉండే లైబ్రరీలో అన్ని అంశాలకు సంబంధించిన విషయాలు.. అసెంబ్లీ చట్టాలకు సంబంధించిన సమగ్ర సమాచారం లభ్యమయ్యేది. నాడు దేవేందర్ గౌడ్ నుంచి కింది స్థాయి నేత వరకూ లైబ్రరీకి వెళ్లే అలవాటు ఉండేది. వారు అసెంబ్లీ సమావేశాల్లోనో, మీడియా సమావేశాల్లోనూ మాట్లాడాలంటే లైబ్రరీకి వెళ్లి తాము మాట్లాడబోయే అంశానికి సంబంధించిన వాటిపై అధ్యయనం చేసేవారు. గతంలో ఉన్న విషయాలను కూడా వారు ఆకళింపు చేసుకునే వారు. అధికారంలో ఉన్నప్పుడైనా, లేకపోయినా సరే ఖచ్చితంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చి అందుకు సంబంధించిన అంశాలను పరిశీలించేవారు. కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ సంప్రదాయానికి నేతలు నీళ్లొదిలేశారు.
మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయాన్ని...
మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి వారికి కేటాయించే సమయంలో మాత్రమే ఎమ్మెల్యేలు వస్తున్నారు. సబ్జెక్ట్ పై అవగాహన కోసం కానీ, తాము మాట్లాడలనుకున్న విషయాలను పార్టీ కేంద్ర కార్యాలయానికి తెలియపర్చేందుకు ఇష్టపడటం లేదు. పార్టీ కేంద్ర కార్యాలయం కూడా దీనిని పట్టించుకోవడం లేదు. సీనియర్ నేతలకు మాత్రమే ఈ విషయం తెలుసు. ఇప్పుడంతా కొత్త తరం నాయకులు కావడంతో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని అసలు పరిగణనలోకి తీసుకోవడం లేదు. దీంతోనే సమస్యలు వస్తున్నాయన్న అభిప్రాయం టీడీపీ సీనియర్ నేతల్లో వ్యక్తమవుతుంది. చంద్రబాబు నాయుడు, లోకేశ్ పాలనలో బిజీగా ఉండటంతో పార్టీ కేంద్ర కార్యాలయం చూసుకోవాల్సి ఉన్నా వాటిని పట్టించుకోకపోవడంతో ఈ రకమైన సమస్యలు అసెంబ్లీలో గాని, బయట గాని తలెత్తుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇందుకు సంబధించి బలోపేతం చేస్తే బాగుంటుందన్న సూచనలు వస్తున్నాయి.


Tags:    

Similar News