TDP : నైరాశ్యంలో తెలుగు తమ్ముళ్లు... రెండేళ్లవుతున్నా అందని పదవులు

తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నారు

Update: 2026-02-24 07:58 GMT

తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా కేసులకు భయపడకుండా అప్పటి ప్రభుత్వాన్ని ఎదిరించిన వారికి నేడు అధికారంలోకి వచ్చిన రెండేళ్లకు కూడా గుర్తింపు లేదని కార్యకర్తలు వాపోతున్నారు. మాజీ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి కూడా చంద్రబాబు, లోకేశ్ లు కేవలం పాలనపై దృష్టి పెట్టకుండా పార్టీ క్యాడర్ గురించి ఆలోచిస్తే మంచిదని ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అనేక మంది పార్టీకి చెందిన కార్యకర్తల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇతర పార్టీల నుంచి ఎన్నికలకు ముందు వచ్చిన వారికి ఉన్న గుర్తింపు గత ఐదేళ్లు జెండా మోసిన వారికి ఎక్కడుందంటూ సోషల్ మీడియాలో క్యాడర్ ప్రశ్నిస్తున్నారు.

ఇతర పార్టీల నుంచి...
తెలుగుదేశం పార్టీ అభిమానిని అని చెప్పుకుని ముందు వరుసలో నిలబడిన చాలామంది అధికారంలో ఉండగా దూరం అవుతున్నారు. అంతే కాదు వారంతా టీడీపీ అని చెప్పుకునేందుకు ఇష్టపడటం లేదు. 2014 లో పార్టీ పిలుపు అందుకొని సమైక్య రాష్ట్రం కోసం పోరాటం, విభజిత ఆంధ్ర ప్రదేశ్ లో కేసీఆర్ ను సోషల్ మీడియాలో ఉతికి ఆరేయడం, జగన్ బ్యాచ్ దృష్టిలో పడి వాళ్ళ అరాచకాలను ఎదుర్కోవడానికి అనేక తిప్పలు పడ్డ వారంతా నేడు సైలెంట్ అయ్యారు. వారిని స్థానిక ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడంతో పాటు వైసీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్య ఇవ్వడాన్ని కూడా తప్పుపడుతున్నారు. కార్యకర్తల సమావేశంలో తాము చంద్రబాబుతో నేరుగా ఫిర్యాదు చేయాలన్నా కొందరు అడ్డుకుంటున్నారంటున్నారు.
పదకొండేళ్ల నుంచి ...
2014 నుండి టీడీపీ ప్రభుత్వం లో ఏమాత్రం ప్రతిఫలం ఆశించకుండా పనిచేసిన వారు నేడు నాయకత్వానికి కనిపించకుండా పోవడం పట్ల ఆవేదన చెందుతున్నారు. సొంత డబ్బులు ఖర్చు చేసుకుని మరీ పార్టీని ముందుకు నడిపించినా అధికారంలోకి వచ్చినా ఏ మాత్రం ప్రయోజనం లేదని అంటున్నారు. 2019 చాప కింద నీరులాగా ప్రజల్లో నెగటివ్ టాక్ తో టీడీపీ ఓడిపోయింది. అయిదేళ్లు పార్టీ కోసం నిలబడిన వాళ్ళకు కేసులు , అప్పులు మిగిలాయన్న ఆవేదన వారిలో కనపడుతుంది. పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్నో త్యాగాలు చేసిన కార్యకర్తలు, అభిమానులు కనుమరుగు అయిపోయారని వారు నెట్టింట ఆవేదన చెందుతున్నారు. అగ్రనేతల దృష్టిలో ఉన్న కొద్ది మందికి కార్పోరేషన్ల పదవులు దక్కాయని, మిగిలిన వారికి రిక్త హస్తాలు చూపుతున్నారంటున్నారు. మరి తమ్ముళ్ల ఆవేదన ఇప్పటికైనా పార్టీ అగ్రనాయకత్వం చెవికి చేరుతుందా? లేదా? అన్నది చూడాలి.


Tags:    

Similar News