Chandrababu Naidu : తంబళ్లపల్లి తెలుగుదేశం పార్టీని నలిపేస్తుందా? చంద్రబాబును తప్పుదోవపట్టించిందెవరు?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్తగా ఉంటారు.

Update: 2025-10-08 07:00 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. పార్టీలో ఎవరినైనా చేర్చుకునే ముందు వారి ట్రాక్ రికార్డులను పరిశీలించి మరీ కండువా కప్పుతారు. అంతేకాదు.. పార్టీలో చేర్చుకునే ముందు అందులోనూ ఎన్నికల సమమయంలో అభ్యర్థిగా నిర్ణయించే ముందు అన్ని కోణాల్లో చంద్రబాబు నాయుడు పరిశీలిస్తారు. కానీ తంబళ్లపల్లి టీడీపీ నేత జయచంద్రారెడ్డి విషయంలో మాత్రం చంద్రబాబును తప్పుదోవపట్టించిదెవరు? అన్న సందేహాలు టీడీపీ నేతల్లోనే వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు టిక్కెట్ ఇవ్వాలంటే అన్ని రకాలుగా నివేదికలు తెప్పించుకుంటారు. మరి ఆ నివేదికలు తంబళ్లపల్లి విషయంలో తప్పుడు తడకగా మారాయా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

చంద్రబాబు తొలి నుంచి...
చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచి కాదు.. 1999 ఎన్నికల నుంచి అభ్యర్థుల ఎంపిక విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అందులోనూ తంబళ్లపల్లి అంటే చంద్రబాబు నాయుడు సొంత జిల్లా. ఆయన సొంత జిల్లా చిత్తూరులోనే టీడీపీ నేతలపై నమ్మకం లేదా? వేరే వాళ్లు ఇచ్చిన నివేదికలను ఆయన నమ్మిజయచంద్రారెడ్డికి కండువా కప్పడమే కాకుండా టిక్కెట్ ఇచ్చారా? అన్నది కూడా పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. నకిలీ మద్యం కేసులో తంబళ్లపల్లి టీడీపీ ఇన్ ఛార్జి జయచంద్రారెడ్డి ప్రధాన నిందితుడిగా ఉండటంతో నాడు బీఫారం ఇచ్చిన చంద్రబాబు ఎందుకు ఇలాంటి వ్యక్తులను పార్టీలోకి తీసుకున్నారన్న ప్రశ్నలు టీడీపీ నేతల్లోనే కలుగుతున్నాయి. జయచంద్రారెడ్డి ఆర్థిక బలం చూసి మాత్రమే టిక్కెట్ ఇచ్చారా? మరెవరైనా సిఫార్సు చేస్తే టిక్కెట్ వచ్చిందా? అని కూడా టీడీపీ నేతలు ఆరా తీస్తున్నారు.
పెద్దిరెడ్డి కుటుంబానికి...
జయచంద్రారెడ్డి పెద్దిరెడ్డి కుటుంబానికి దగ్గరగా ఉంటారని తెలుసు. ఆయనతో విభేదించి బయటకు రారని కూడా అక్కడ ఉన్నవారికి ఎవరికైనా తెలుసు. ఆ నియోజకవర్గంలో సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న నేతలకు కాదని, ఎన్నికలకు ఆరు నెలల ముందు పార్టీలో చేరిన జయచంద్రారెడ్డికి టిక్కెట్ ఎందుకు ఇచ్చారన్న సందేహాలు కలుగుతున్నాయి. అయితే టీడీపీలో ఒక కీలక నేత, పల్నాడు కు చెందిన ముఖ్య నేత ఒకరు చంద్రబాబు చెవిలో పోరు పెట్టి మరీ జయచంద్రారెడ్డికి టిక్కెట్ ఇప్పించారంటున్నారు. దీంతో పాటు మరొక కీలక నేత నుంచి లోకేశ్ కు కూడా జయచంద్రారెడ్డికి టిక్కెట్ ఇవ్వాలని సిఫార్సు రావడంతోనే టిక్కెట్ వచ్చిందని చెబుతున్నారు. అందువల్లనే చివర వరకూ బీఫారం ఇవ్వకుండా ఆపినా ఆఖరి క్షణంలో చంద్రబాబు ఇచ్చేశారట.
నకిలీ మద్యం కేసు...
ఇప్పుడు నకిలీ మద్యం కేసు కూటమి ప్రభుత్వానికి మచ్చగా మారింది. వైసీపీకి అస్త్రంగా మారింది. పెద్దిరెడ్డి మనిషి జయచంద్రారెడ్డి అని ఇప్పుడు టీడీపీ నేతలు చెప్పినప్పటికీ జనం నమ్మే పరిస్థితి ఉండదు. ఎందుకంటే జయచంద్రారెడ్డిని అక్కున చేర్చుకున్నది చంద్రబాబు. కండువా కప్పింది ఆయనే. మరి పెద్దిరెడ్డితో ఎలా ముడిపెడతారన్న ప్రశ్న వైసీపీ నేతల నుంచి ఎదురవుతుంది. చంద్రబాబు నాయుడు తన సొంత జిల్లాలోనే అందులోనూ తనకు ప్రధాన శత్రువైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు ప్రాతినిధ్యం వహిస్తున్న తంబళ్లపల్లి విషయంలోనే తప్పటడుగు వేశారంటే... ఆయన ఎవరి మాటలు నమ్మారన్నది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. మొత్తం మీద టీడీపీని తంబళ్లపల్లి మానసికంగా నలిపేస్తుందనే అంటున్నారు.


Tags:    

Similar News