కొలికపూడి మరోసారి సంచలన కామెంట్స్
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై సంచలన కామెంట్స్ చేశారు
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై సంచలన కామెంట్స్ చేశారు. తనను అవమానిస్తే సహిస్తానని, తన జాతిని అవమానిస్తే తెగిస్తా అని కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎక్కువ మంది ప్రజలకు న్యాయం చేయాలని తాను చూస్తుంటే తనను పని చేయకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. తనపై సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా ఎంపీ కార్యాలయం నుంచి పోస్టులు పెడుతున్నారని, తనను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
హత్యాయత్నం జరిగిందని...
తనపై హత్యాయత్నం జరిగిందని కూడా కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. నెమలి వేణుగోపాల స్వామి ఆలయంలో తనపై దాడి చేయడానికి స్కెచ్ వేశారని, ఆ విషయం తనకు నిఘా వర్గాల ద్వారా సమచారం అందిందని కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. జగన్ హయాంలోనూ తనపై కేసులు నమోదు చేశారు కానీ, దాడులు చేయలేదని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై ఈ దాడులకు దిగి హత్యాయత్నం చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఎవరికీ తాను సమాధానం చెప్పాల్సిన పనిలేదని, తాను రాజీపడలేదని అన్నారు.