టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర బాధ్యత స్వీకారం
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ముద్దాడ రవిచంద్ర భాద్యతలను స్వీకరించారు
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ముద్దాడ రవిచంద్ర భాద్యతలను స్వీకరించారు. ముద్దాడ రవిచంద్ర శ్రీవారి ఆలయంలో శుక్రవారం ఉదయం 7.34 గంటలకు టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన టీటీడీ పాలక మండలి సభ్య కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
భక్తుల సలహాలను తీసుకుని...
శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఈవో దంపతులకు రంగ నాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించగా అదనపు ఈవో తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం ముందు ఈవో మీడియాతో మాట్లాడుతూ గత నెల రోజులుగా తిరుమలలో చాలా విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. శ్రీవారి భక్తులకు సాటి భక్తుడిగా సేవ చేస్తానని చెప్పారు.భక్తుల నుండి చాలా సలహాలు సూచనలు వచ్చాయని, వాటిని తానే స్వయంగా పరిశీలించి ఆ అనుభవంతో భక్తులకు మంచి ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా ఏర్పాట్లు చేస్తామని తెలియజేశారు.