Kolikapudi : కొలికపూడి ఇలాకాలో మరో వివాదం.. ఈసారి జనసేనతోనే జగడం

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఏ ముహూర్తాన ఎమ్మెల్యే అయ్యారో కానీ అప్పటి నుంచి అక్కడ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి

Update: 2025-07-16 07:04 GMT

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఏ ముహూర్తాన ఎమ్మెల్యే అయ్యారో కానీ అప్పటి నుంచి అక్కడ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో ఎన్నడూ ఆ పరిస్థితి లేదు. గతంలో టీడీపీ గెలిచినప్పుడు ఇన్ని వివాదాలు చుట్టుముట్ట లేదు. కానీ 2024 ఎన్నికల్లో తిరువూరు నుంచి కొలికపూడి శ్రీనివాసరావు గెలిచిన నాటి నుంచి ఆ నియోజకవర్గం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. పార్టీ నాయకత్వానికి కూడా తిరువూరు తలనొప్పిగా తయారయింది. ఎన్ని మార్లు పంచాయతీలు జరిగినా అక్కడ ఫుల్ స్టాప్ పడటం లేదు. చంద్రబాబు నాయుడు పిలిచి వార్నింగ్ ఇచ్చినా పరిస్థితుల్లో మార్పులేదు. అక్కడ కూటమి పార్టీలకు పడటం లేదు. సొంత పార్టీలో శత్రువులు ఒకవైపు, మిత్రపక్షమైన జనసేనలోనూ వ్యతిరేకించే నేతలు తయారవ్వడంతో తిరువూరును ఇక ఆపరేట్ చేయడం ఎవరి వల్లా కాదు.

పార్టీకి ఇబ్బందికరంగా...
తెలుగుదేశం పార్టీకి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇబ్బందికరంగా మారారు. సొంత పార్టీ నేతకు చెందని రమేష్ రెడ్డితో కొలికపూడి శ్రీనివాసరావు కు మధ్య విభేదాలు తలెత్తాయి. రమేష్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, అందుకు డెడ్ లైన్ కూడా పెట్టారు. కానీ పార్టీ నాయకత్వం మాత్రం అక్కడ పరిస్థితిని తెలుసుకుని ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పార్టీ క్రమశిక్షణ సంఘం ఎదుటకు కొలికపూడిని పిలిపించి మందలించారు. అంతే కాదు కొలికపూడికి తాము సహకరించబోమంటూ టీడీపీ తిరువూరు నేతలే తెగేసి చెప్పడంతో అక్కడ పరిస్థితులు ఎలా సద్దుమణిగించాలో తెలియని పరిస్థితుల్లో అధినాయకత్వం దిద్దుబాటు చర్యలు తీసుకుంది. ఇటీవల కొంత వరకూ ఆ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. కొలికపూడి శ్రీనివాసరావుకు జాగ్రత్తగా వ్యవహరించాలని, అందరినీ కలుపుకుని పోవాలని కూడా చెప్పి పంపింది.
ఆ ఒక్క కారణంతోనే...
కొలికపూడి శ్రీనివాసరావు రాజధాని అమరావతి ఉద్యమంలో కీలకంగా ఉన్నారని భావించి చంద్రబాబు నాయుడు టిక్కెట్ ఇచ్చారు. కూటమి పార్టీల హవాతో మొన్నటి ఎన్నికల్లో గెలిచారు. తిరువూరు నియోజకవర్గంలో టీడీపీకి బలమైన నేతలున్నప్పటికీ వారిని కాదని, అక్కడ నియమించిన ఇన్ ఛార్జిని కాదని కొలికపూడికి టిక్కెట్ ఇచ్చారు. రాజధాని అమరావతి ఆందోళన చేసిన వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని భావించి చంద్రబాబు కొలికపూడికి ఈ టిక్కెట్ ఇచ్చారని చెప్పాలి. అయితే దొరికిన ఈ అరుదైన అవకాశాన్ని కొలికపూడి శ్రీనివాసరావు నిలుపుకోలేకపోతున్నారు. ప్రతి విషయంలోనూ వివాదమే. తానే మోన్కార్ గా ఉండాలని, చివరకు నియోజకవర్గంలో తన గెలుపునకు కారణమయిన వారిని కూడా పక్కన పెట్టి సొంత క్యాడర్ ను ఏర్పాటుచేసుకుంటూ పార్టీ నేతల నుంచి వ్యతిరేకత ను ఎదుర్కొంటున్నారు.
జనసేన సోషల్ మీడియాలో...
ఇక తాజాగా తిరువూరు నియోజకవర్గంలో టిడిపి, జనసేన మధ్య మట్టి పంచాయతీ నెలకొంది. తెలుగుదేశం పార్టీ మట్టి దోపిడీని ఆధారాలతో సహా జనసేన నాయకులు బహిరంగంగానే నిలదీస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా వారు తిరువూరులో జరుగుతున్న ఇసుక, మట్టి దోపిడీలను జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. తిరువూరు నియోజకవర్గంలోని చీమలపాడులో మట్టి దోపిడీ పై జనసేన నాయకులు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. మట్టి తవ్వకాల వీడియోలను సెల్ఫీ వీడియో ద్వారా తిరువూరు జనసేన ఇన్ ఛార్జి మనుబోలు శ్రీనివాసరావు బయపెట్టారు. గత ప్రభుత్వం పై దుమ్మెత్తి పోశామని, ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటూ మనబోలు శ్రీనివాసరావు ప్రశ్నించడం విశేషం. గతంలో తమ పోరాటాలను మెచ్చుకున్న వారు ఇప్పుడు ప్రశ్నిస్తుంటే బూతులు తిడుతున్నారంటూ మండిపడుతున్నారు. ప్రజాధనం ఎలా లూఠీ అవుతుందో చూడండి అంటూ మనుబోలు శ్రీనివాసరావు పోస్టు చేసిన వీడియో వైరల్ గా మారింది.


Tags:    

Similar News