Tirumala : తిరుమలకు నేడు వెళుతున్నారా? అయితే దర్శన సమయం ఎంతంటే?
తిరుమలలో నేడు కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారమయినా భక్తుల రద్దీ తగ్గలేదు
తిరుమలలో నేడు కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారమయినా భక్తుల రద్దీ తగ్గలేదు. కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. గత మూడు నెలల నుంచి తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమలకు ఈ స్థాయిలో జులై నెలలో భక్తుల రద్దీ పెరగడం ఇదే ప్రధమమని అధికారులు చెబుతున్నారు. శ్రావణ మాసం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుని స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
హుండీ ఆదాయం...
తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం కూడా భారీగానే పెరిగింది. జూన్ నెలలోనే 120 కోట్ల రూపాయలు దాటడంతో ఈ నెలలో కూడా అంతే స్థాయిలో హుండీ ఆదాయం వచ్చే అవకాశముంది. ఎందుకంటే గత నెల రోజులుగా భక్తుల రద్దీ తగ్గకపోవడం, కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి బయట వరకూ క్యూ లైన్ నిండిపోతుండటం సాధారణంగా కనిపించే అంశంగా మారింది. అయితే సామాన్య భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
పన్నెండు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పన్నెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటలకుపైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 85,486 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 30,929 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.85 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.