Tirumala : తిరుమలలో శిలాతోరణం వరకూ నేడు భక్తుల క్యూ లైన్.. రెండు కిలోమీటర్లు ప్రయాణించి?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు తరలి వస్తున్నారు

Update: 2025-07-20 02:40 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు తరలి వస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో పాటు పొరుగు రాష్ట్రమైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఇక తిరుపతి స్థానికులు కూడా ఆదివారం కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చారని చెబుతున్నారు. దీంతో అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. బయట వరకూ క్యూ లైన్ విస్తరించిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల తెలిపారు.

రెండున్నర నెలకు పైగానే...
మే 15వ తేదీన సిఫార్సు లేఖలను తీసుకోవడం ప్రారంభం నుంచి ప్రారంభమయిన రద్దీ తిరుమలలో నేటి వరకూ కొనసాగుతూనే ఉంది. జులై చివరి నెల వచ్చినా భక్తుల సంఖ్య మాత్రం తగ్గలేదు. హుండీ ఆదాయం కూడా భారీగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. గతంలో జులై నెలలో భక్తుల సంఖ్యతక్కువగా ఉంటుంది. విద్యాసంస్థలు ప్రారంభం అవ్వడంతో తిరుమలకు భక్తుల సంఖ్య తక్కువగా ఉంటుందని సాధారణంగా అంచనా వేస్తారు. వేసవి రద్దీ జులై మొదటి వారం వరకూ మాత్రమే కొనసాగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల తెలిపారు.
పన్నెండు గంటల సమయం...
అయితే ఈరోజు కూడా తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. నేడు కూడా శిలాతోరణం వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. రెండు కిలోమీటర్లకు పైగానే వెళ్లి స్వామి వారిని దర్శించుకోవాలి. ఈరోజు ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుంది. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు నుంచి ఆరు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 90,011 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 33,328 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.23 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.



Tags:    

Similar News