Tirumala : ఆదివారం తిరుమలకు వస్తున్నారా? అయితే గుర్తుంచుకోండి

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంది.

Update: 2025-06-15 02:29 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంది. గత నెల రోజుల నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. వేసవి రద్దీని ముందుగానే అంచనా వేసిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సామాన్య భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు అవసరమైన మంచినీరు, మజ్జిగ, అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. క్యూ లైన్ల వద్ద దాదాపు పన్నెండు అన్న ప్రసాదం కౌంటర్లను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసింది.

శుక్రవారం నుంచి రద్దీ...
గత నెల రోజుల నుంచి కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి బయట వరకూ క్యూ లైన్లు విస్తరించి ఉన్నాయి. మే 15వ తేదీ నుంచి భక్తుల రద్దీ మరింతగా పెరిగింది. ఎక్కువ మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక శుక్రవారం నాడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అభిషేక సేవ ఉండటంతో దర్శన సమయం మూడు గంటలకుపైగా తగ్గుతుంది. ఆరోజు అరవై వేల నుంచి అరవై అయిదు వేల మంది వరకూ భక్తుల దర్శించుకునే అవకాశముంది. మే, జూన్ లలో పరతి శుక్రవారం ఎక్కువ మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
బయట వరకూ క్యూ లైన్...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. బయట సేవా సదన్ వరకూ క్యూ లైన్ లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటలకుపైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 91,720 మందిభక్తులు దర్శించుకున్నారు. వీరిలో 44,678 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.80 కోట్ల రూపాయలు వచ్చింది.


Tags:    

Similar News