Tirumala : ఆదివారం తిరుమలకు క్యూ కట్టిన భక్తులు.. దర్శన సమయం ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంది. అన్ని కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. తిరుమల వీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతుంది. మాడ వీధులన్నీ గోవింద నామస్మరణలతో మారుమోగిపోతున్నాయి. నిన్న అర్ధరాత్రి నుంచి తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో రావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు ఏ మాత్రం ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు.
నేడు శ్రీవారి దర్శన టోకెన్లు జారీ...
నేడు స్థానికులకు శ్రీవారి దర్శన టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు జారీ చేయనున్నారు. ప్రతి నెలా మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనానికి అవకాశం కల్పించనున్నారు. ఇందులో భాగంగా జూన్ 1న టోకెన్లను టీటీడీ జారీ చేయనుండటంతో పెద్దయెత్తున స్థానికులు క్యూ కట్టారు.తిరుపతిలోని మహతి ఆడిటోరియం, బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్‌లో టోకెన్ల జారీ చేయనున్నారు. టోకెన్లు జారీ చేసే కేంద్రం వద్ద తొక్కిసలాట జరగకుండా టీటీడీ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఆధార్ కార్డు చూపితేనే ఈ టోకెన్లు జారీ చేయనున్నారు.
శిలాతోరణం వరకూ...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. శిలాతోరణం వరకూ భక్తుల వరకూ క్యూ లైన్ విస్తరించింది. ఉచిత దర్శనం క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై గంటలకు పైగానే సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 95,080 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 39,668 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.47 కోట్ల రూపాయల వచ్చిందని తెలిపారు.