Tirumala : తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఇంతగా ఉండటానికి రీజన్ అదేనట
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువయింది
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువయింది. గురువారం నుంచి తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి బయట వరకూ క్యూ లైన్లు విస్తరించి ఉన్నాయి. పెళ్లిళ్ల సీజన్ తో పాటు వేసవి సెలవులు కూడా ముగియడంతో శ్రీవారి దర్శనానికి ఎక్కువ మంది తరలి వస్తున్నారు. దీంతో పాటు సిఫార్సు లేఖలను కూడా అనుమతిస్తుండటంతో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగిందని తిరుమల తరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
మరో కీలక నిర్ణయం...
తిరుమలకు వచ్చే సామాన్య భక్తులకు సత్వరం దర్శనం అయ్యేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. క్యూ లైన్లు ఎంత పొడవున్నా వెంటవెంటనే దర్శనం ముగించుకుని వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తుల కోసం మజ్జిగ, అన్న ప్రసాదాలను కూడా శ్రీవారి సేవకుల ద్వారా పంపిణీ చేస్తున్నారు. దీంతో పాటు టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి సేవలో పాల్గొనేందుకు ఇక ఎన్ఆర్ఐలకూ అవకాశం కల్పించింది. శ్రీవారి సేవకు 14 దేశాల్లోని ఎన్ఆర్ఐల ఆసక్తి చూపడంతో వారికి అవకాశాలను కల్పించాలని నిర్ణయించింది.
అన్ని కంపార్ట్ మెంట్లు నిండి...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. బయట శిలా తోరణం వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించి ఉంది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని : 90,211 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 43,346 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.11 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.