Teluau Politics : పొగడ్తలు.. ప్రశంసలు అశాశ్వతం.. పొగిడిన వారే తిడతారు భయ్యా.. పొంగిపోతే ఇక అంతే
రాజకీయాల్లో అధికారంలో ఉన్నప్పుడు ప్రశంసలు సహజమే. కానీ వాటికి పొంగిపోతే వచ్చేది నష్టమే
రాజకీయాల్లో ఎప్పుడూ అంతే. అధికారంలో ఉన్నప్పుడు వీరుడు.. శూరుడు అని పొగడ్తలు సహజమే. గెలిచిన తర్వాత ఆయనంతట లీడర్ లేరంటారు. అదే ఓటమి పాలయిన తర్వాత మాత్రం ఆ స్థాయి ప్రశంసలు వారిపై వినపడవు. ఏ పార్టీలోనైనా జరిగేదదే. ఏ నాయకుడి విషయంలోనైనా అదే జరుగుతుంది. జగన్ అయినా.. చంద్రబాబు అయినా.. లోకేశ్ అయినా.. కేసీఆర్ అయినా.. రేవంత్ రెడ్డి అయినా ఇందులో అందరికీ ఒకటే విధానం. ఏం పొగడ్తలు. ఏం ప్రశంసలు. ఆయన వల్లే అధికారం వచ్చిది కొందరు. ఆయన తమ నేత అని మరికొందరు. ఇక ఆయనవల్లనే పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని మరొకడగు వేసి ఇంకొందరు ఇలా అందరూ ప్రశంసలు కురిపించే వారే.
కేసీఆర్ వ్యూహానికి తిరుగులేదంటూ...
కేసీఆర్ అధికారంలో ఉన్ననాళ్లు ఆయనంత వ్యూహకర్త లేరన్నారు. ఆయన వ్యూహానికి తిరుగు లేదన్నారు. ఇక కేసీఆర్ తెలంగాణకు శాశ్వత ముఖ్యమంత్రి అని నేతలు బిల్డప్ ఇచ్చారు. కానీ ప్రజలు దెబ్బకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఏడాది నుంచి వ్యవసాయపనులను చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక పార్టీ కూడా ఆయన చేతిలో పెద్దగా లేదు. పది మంది ఎమ్మెల్యేలు అధికారం కోల్పోయిన వెంటనే వెళ్లిపోయారు. ఇక పార్టీలో అసమ్మతి స్వరాలు పెల్లుబికాయి. చివరకు కుటుంబ సభ్యులను కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి కేసీఆర్ ది. కన్న కూతురు, కుమారుడి విషయంలో ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. పార్లమెంటు ఎన్నికల్లో కనీసం ఒక్క స్థానం కూడా గెలవలేకపోయింది.
జగన్ ఫొటో వల్లనేనంటూ...
ఇక జగన్ కూడా అధికారంలో ఉన్నప్పుడు ఏం పొగిడారు. జగన్ ఫొటోతోనే గెలిచామన్నారు. జగన్ మరో ముప్ఫయి ఏళ్లు అధికారంలోకి ఉండటం ఖాయమని చెప్పారు. వై నాట్ 175 అంటూ పెద్దయెత్తున నినాదాలు చేశారు. వై నాట్ కుప్పం అంటూ కేకలు పెట్టారు. కట్ చేస్తే.. 2024 ఎన్నికల్లో అధికారం కోల్పోయిన నాటి నుంచి వైసీపీ నేతలు, నమ్మకమైన లీడర్లు చేజారి పోయారు. పార్టీని వదిలి జగన్ పై విమర్శలు చేశారు. విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు కూడా వెళ్లిపోయారు. ఇక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అయితే ఎవరూ నిలబడటం లేదు. అందరూ వెళ్లిపోతున్నారు. జగన్ కు ఉన్న క్రేజ్ ఏమయిపోయిందంటే..ఎవరికీ అర్థం కాని విషయం. నాడు పొగిడిన నేతలే నేడు తిడుతుండటం మన చెవులారా విన్నాం.
పవన్ విషయంలోనూ...
పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో ఓటమి పాలయినప్పుడు చూశాం. ఆయన వల్ల రాజకీయాలు కాదని అన్నారు. చాలా మంది పార్టీని, పవన్ ను విడిచి వెళ్లారు. కనీసం రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల ఓటమి పాలయ్యారంటూ సెటైర్లు వేశారు. అందరూ విమర్శలు చేశారు. సొంత పార్టీ నేతల నుంచి విపక్ష పార్టీ నేతల వరకూ విమర్శలు చేసిన వారే. పవన్ అమ్ముడు పోయారంటూ అన్న వారు కూడా లేకపోలేదు. అదే 2024 ఎన్నికల్లో గెలిచిన వెంటనే పవన్ ను మించిన నాయకుడు లేరంటున్నారు. పవన్ స్ట్రాటజీ వల్లనే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రయిక్ రేట్ అంటూ తెగ పొగిడేస్తున్నారు. జనసేనలో కీలక నేతలు చేరేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఒక ఓటమి విమర్శలు తెస్తే, అదే గెలుపు మాత్రం పొగడ్తలను మూటగట్టుకుని వస్తుంది.
మహానాడులో లోకేశ్ ను...
తాజాగా మహానాడులో లోకేశ్ ను ప్రశంసిస్తుంటే ఇదే పరిస్థితి కనిపిస్తుంది. నారా లోకేశ్ 2019 ఎన్నికల్లో ఓటమి పాలయినప్పుడు సొంత పార్టీ నేతలే విమర్శలు చేశారు. అదే లోకేశ్ ఇప్పుడు భావి నాయకుడిగా మారాడు. సీనియర్ల నుంచి జూనియర్ల వరకూ ఒకటే ప్రశంసలు. లోకేశ్ నామస్మరణతో మహానాడు ప్రాంగణం మారుమోగింది. గెలిచింది లోకేశ్ వల్లనే అన్న స్థాయిలో నేతల ప్రసంగాలు కొనసాగాయి. అంతా బాగున్నప్పుడు ప్రశంసలు.. అధికారంలో లేనప్పుడు మాత్రం తెగడ్తలు రాజకీయాల్లో మామూలే. అది చూసి పొంగిపోయి జబ్బలు ఎవరు చరచుకున్నా తర్వాత భవిష్యత్ లో చతికలపడటం ఖాయమని అనేక ఎన్నికలు చెబుతున్నాయి. అందుకే పొగడ్తలు, ప్రశంసలు శాశ్వతం కాదు. అవి కూడా ఎన్నికల ఫలితాలను బట్టి మారుతుంటాయి.