Ap, Telangana Politics : పార్టీలు వేరు.. కానీ ఆత్మలు ఒక్కటేనా?

రెండు రాష్ట్రాలు విడిపోయినా అక్కడ ఉన్న పార్టీల అధినేతలు సత్సంబంధాలు నెరపడం ఇప్పుడు చర్చనీయాంశమైంది

Update: 2025-11-27 09:06 GMT

రెండు రాష్ట్రాలు విడిపోయినా అక్కడ ఉన్న పార్టీల అధినేతలు సత్సంబంధాలు నెరపడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ బలంగా ఉండేవి. అయితే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పుంజుకున్నా, ఏపీలో మాత్రం అది జీరో లెవెల్ కు చేరుకుంది. ఇక తెలంగాణలో బీజేపీ బలంగా కనిపిస్తున్నా, ఏపీలో మాత్రం సింగిల్ డిజిట్ కే పరిమితమయింది. తెలంగాణాలో రెండు జాతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. బీఆర్ఎస్ కూడా పదేళ్ల పాటు రాష్ట్రాన్ని ఏలింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో తమిళనాడు తరహాలో జాతీయ పార్టీలకు ఇక్కడ అవకాశం కనిపించడం లేదు. ఇక్కడ టీడీపీ, జనసేన, వైసీపీ వంటి ప్రాంతీయ పార్టీలే బలంగా ఉన్నాయి.

టీడీపీ..కాంగ్రెస్ లు...
అయితే విచిత్రం ఏంటంటే.. ఏపీలో బీజేపీకి తెలుగుదేశం పార్టీకి పొత్తు ఉంది. కేంద్ర, రాష్ట్రంలో అధికారాన్నిరెండుపార్టీలు పంచుకున్నాయి. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరూ సన్నిహితంగా ఉండటం కొంత రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి రావడంతో ఆయన పార్టీ అధినేత చంద్రబాబుతో నేటికీ సత్సంబంధాలు నెరుపుతున్నారు. ఇద్దరూ ఇటీవల కాలంలో పలుమార్లు కలిశారు. కలసి ముచ్చటించుకున్నారు. తెలంగాణలో టీడీపీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ పక్కన నిలబడుతుంది. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు తమ ఓటర్లకు ఎలాంటి పిలుపు నివ్వకుండా మౌనం పాటించడం కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా మారింది.
బీఆర్ఎస్... వైసీపీలు...
మరొకవైపు తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ అధినేతలు ఇద్దరూ సఖ్యతగా ఉంటారు. గతంలోనూ 2019 ఎన్నికల తర్వాత జగన్ ప్రమాణస్వీకారానికి కేసీఆర్ హాజరయ్యారు. అలాగే బీఆర్ఎస్ తో జగన్ సఖ్యతగా ఉంటున్నారు. ఇటీవల బెంగళూరులో జరిగిన ప్రయివేటు కార్యక్రమంలో జగన్, కేటీఆర్ లు కలవడం సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగిందనే చెప్పాలి. ఇక్కడ రెడ్డి సామాజికవర్గం కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంది. జగన్ ను అభిమానించే వాళ్లు మాత్రం బీఆర్ఎస్ కు మద్దతుగా నిలుస్తున్నారు. మొత్తం మీద రాష్ట్రాలు రెండుగా విడిపోయి ఎవరి పాలన వారు చేసుకుంటున్నప్పటికీ, పార్టీ అగ్రనేతల మధ్య సత్సంబంధాలు మంచి పరిణామమే అయినా రాష్ట్ర ప్రయోజనాల వద్దకు వచ్చేసరికి ఎవరి రాష్ట్రం ప్రయోజనాల కోసం వారు ప్రయత్నిస్తుండటం కూడా జరుగుతుంది.


Tags:    

Similar News