Ys Jagan : జగన్ నర్సీపట్నం పర్యటనకు ముందు పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్....కండిషన్స్ ఇవే
వైసీపీ అధినేత జగన్ నేడు నర్సీపట్నంలో పర్యటనకు పోలీసులు ఆంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చారు
వైసీపీ అధినేత జగన్ నేడు నర్సీపట్నంలో పర్యటనకు పోలీసులు ఆంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చారు. వీటిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా హెచ్చరించారు. పోలీసులు నిర్ణయించిన మార్గంలోనే జగన్ వెళ్లాల్సి ఉంటుందని డీజీపీ తెలిపారు. మధ్యలో వాహనాలను ఆపడం, భారీ జనసమీకరణ చేసినా చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. అలా పోలీసులు ఇచ్చిన అనుమతులను జగన్ ఉల్లంఘిస్తే నర్సీపట్నం పర్యటనకు ఇచ్చిన అనుమతి ఆటోమేటిక్ గా రద్దవుతుందని డీజీపీ తెలిపారు. అంతేకాకుండా దీనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమని చెప్పారు. వైసీపీ నేతలు ఇది గుర్తుంచుకోవాలన్నారు.
క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం...
రాజకీయ పార్టీ హోదా, పార్టీతో సంబంధం లేకుండా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వార్నిగ్ ఇచ్చారు. పోలీసులు ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించబోరన్న విషయాన్ని డీజీపీ స్పష్టం చేశారు. చట్టం నిర్దేశించిన ప్రకారమే జగన్ పర్యటన కొనసాగాలని, సెక్షన్ 30 అమలులో ఉందని, సెక్షన్ 30 ఎ ప్రకారం పోలీసులు సూచించిన మార్గంలోనే జగన్ నర్సీపట్నం వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే నిర్దేశిత సమయంలోనే ఆయన పర్యటన కొనసాగాల్సి ఉంటుందని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. జగన్ వెంట ఊరేగింపులు, ర్యాలీలు వంటివి నిషేధిస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వివరించారు. అనుమతించిన ప్రాంతంలోనే రాజకీయ నినాదాలు, స్వాగతాలు చేయాలని మిగిలిన చోట్ల సభలు కూడా నిర్వహించరాదని పేర్కొన్నారు.
పద్దెనిమిది రకాల నిబంధనలు...
కార్యకర్తలను అధికంగా సమీకరించి ట్రాఫిక్ సమస్యలకు కారణమయితే కేసులో పెడతామని డీజీపీ హెచ్చరించారు. అనుమతి ఇచ్చిన వాహనాలను మాత్రమే జగన్ పర్యటనలో ఉపయోగించాలన్నారు. ఏదైనా ప్రమాదం, ఆస్తినష్టం, ప్రాణ నష్టం జరిగినా నిర్వాహకులదే బాధ్యత అని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా హెచ్చరించారు. దీనికి సంబంధించి లిఖితపూర్వకంగా హామీ పత్రాన్ని ఇవ్వాలని అన్నారు. జగన్ పర్యటనకు మొత్తం పద్దెనిమిది రకాల నిబంధనలను విధించారు. జగన్ కాన్వాయ్ లో పది వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. పోలీసులు సూచించిన మార్గంలోనే జగన్ పర్యటించాల్సి ఉంటుందని, దారి తప్పితే మాత్రం చర్యలు తప్పవని డీజీపీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.