Pawan Kalyan : పవన్ ఇమేజ్ పెరిగిందా? తగ్గిందా? తూకం ఎటు వైపు ఉందంటే?

జనసేన అధినేతగా జనంలోకి వచ్చి అధికారాన్నిచేపట్టిన పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు

Update: 2025-06-04 07:35 GMT

జనసేన అధినేతగా జనంలోకి వచ్చి అధికారాన్నిచేపట్టిన పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈరోజుకు గత ఏడాది ఎన్నికల ఫలితాలు వచ్చాయి. జనసేనకు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రయిక్ రేటు వచ్చింది. ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లోనూ, రెండు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు అందరూ గెలిచారు. దాదాపు పదిహేడు శాతం ఓటు బ్యాంకును కూడా సొంతం చేసుకుంది. తర్వాత చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టారు. కీలకమైన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖతో పాటు తనకు అత్యంత ఇష్టమైన అటవీ శాఖను అడిగి మరీ తీసుకున్నారు. తనతో పాటు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కు కేబినెట్ లో అవకాశం కల్పించారు.

తనకు కేటాయించిన...
తొలిసారి మంత్రి పదవి తీసుకోవడంతో కొన్ని రోజుల పాటు తనకు అప్పగించిన శాఖలపై పవన్ కల్యాణ్ పూర్తి స్థాయి అథ్యయనం చేశారు. కేరళలో ఉన్న ఏపీకి చెందిన ఐఏఎస్ అధికారి కృష్ణతేజ్ ను తన టీంలోకి తెచ్చుకుని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. గ్రామాల్లో రహదారులు, మంచినీటి సమస్యలను ప్రధానంగా తొలగించేందుకు ఒకింత పవన్ కల్యాణ్ చేసిన ప్రయత్నాలు ఫలించాయని చెప్పాలి. పంచాయతీలకు నిధులు విడుదల చేయించడంలో పవన్ కల్యాణ్ సక్సెస్ అయ్యారు. గిరిజన ప్రాంతాల్లో రహదారులను నిర్మించి అటవీ పుత్రులకు అండగా తాను ఉన్నానన్న భరోసాను పవన్ కల్యాణ్ ఇవ్వగలిగారు. ఇక ఏనుగుల దాడి నుంచి పంటలను రక్షించేందుకు కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను తెప్పించడంలో కీలకంగా వ్యవహరించారు.
మౌనంగా ఉండటం...
ఇక ఏడాది కూటమి ప్రభుత్వ పాలనలో పవన్ కల్యాణ్ కొన్ని నిర్ణయాల పట్ల మౌనంగా ఉండటం, ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోవడం ఒకింత ఆయన ఇమేజ్ ను డ్యామేజీ చేస్తుందనే చెప్పాలి. పవన్ కల్యాణ్ గతంలో ఎన్నడూ అధికారంలో లేకపోవడం, తాను పవర్ లోకి వస్తే ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై ప్రశ్నించే వారు ఎక్కువయ్యారు. ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చినట్లు తనకు తాను ప్రకటించుకున్న పవన్ కల్యాణ్ ప్రశ్నల గురించి మానేశారు. ఆయన ప్రభుత్వ నిర్ణయాలకు తలూపటమే ఇప్పుడు విమర్శలకు తావిస్తుంది. అమరావతి రాజధాని నిర్మాణానికి ఇస్తున్న ప్రాధాన్యత సమస్యల పరిష్కారానికి పాటుపడకపోవడంపై పవన్ మౌనాన్ని సోషల్ మీడియాలో చాలా మంది తప్పుపడుతున్నారు.
ప్రభుత్వంలో ఉండి...
నిజానికి ప్రభుత్వంలో ఉండి బహిరంగంగా విమర్శించడానికి అవకాశం లేదు. అంతర్గత సమావేశాల్లోనే తనకున్న అభ్యంతరాలను తెలియజేయాల్సి ఉంటుంది. చంద్రబాబు కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రిగా ఉండి బహిరంగంగా విమర్శలు చేస్తే అది ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుంది. ఎవరైనా ఇలాగేనే చేస్తారు. కానీ పవన్ కల్యాణ్ అంతర్గత సమావేశాల్లోనూ తలూపి రావడం వల్లనే ఈ విమర్శలు ఎక్కువయ్యాయని అంటున్నారు. ఆయన గత ఎన్నికల సందర్భంగా మాట్లాడిన మాటలు, ఇచ్చిన హామీలను ట్రోల్ చేస్తూ వైసీపీ నేతలు పవన్ కల్యాణ్ వెంట పడుతున్నారు. మొత్తం మీద పవన్ కల్యాణ్ నిజాయితీగా ఉన్నప్పటికీ, తన శాఖల విషయంలో మంచి పురోగతి సాధించినప్పటికీ ప్రశ్నించడం మానేసి ప్రజల్లో చులకనయ్యారంటున్నారు.


Tags:    

Similar News