Pawan kalyan : కామెంట్ చేసినోళ్లను మడత పెట్టి కింద కూర్చోబెడతా
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైసీపీ నేతలపై సంచలన కామెంట్స్ చేశారు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైసీపీ నేతలపై సంచలన కామెంట్స్ చేశారు. నిడదవోలులో జరిగిన సభలో ఆయన ఆవేశంగా మాట్లాడారు. రౌడీయిజం చేసేవారిని మడత పెట్టి కింద కూర్చోపెట్టాలన్నారు. వామపక్ష తీవ్ర వాదులతో ఏకీభవించకపోయినా వారే ప్రభుత్వంతో తలపడి ఏమీ సాధించలేకపోయారన్నారు. తాను బెదిరింపులకు లొంగేవాడిని కానని పవన్ కల్యాణ్ అన్నారు. సామాజిక మాధ్యమాల్లో కాని, విదేశాల్లో కూర్చుని వాగే వాళ్లతో సహా, ఇక్కడ కూర్చుని భవిష్యత్ లో ఏంచేస్తామో చెప్పేవారికి కూడా తాను వార్నింగ్ ఇస్తున్నానని అన్నారు.
ఇష్టారాజ్యంగా మాట్లాడితే...
ఏ అండదండలు లేకుండానే ఇంత వరకూ వచ్చామంటే ఎంత కమిట్ మెంట్ తమకు ఉండాలన్నారు పవన్ కల్యాణ్. విమర్శలు చేయవచ్చు కానీ.. గీత దాటితే చేతి గీతలను కూడా తొలగిస్తామని తెలిపారు. ఈ రాష్ట్రంలో రౌడీయిజం, బెదిరింపులు చెల్లవని అన్నారు. జనసేన ప్రభుత్వంలో భాగం కాబట్టి, ప్రతి విషయంలో వైసీపీ అంటే గౌరవమని, పాత పద్ధతిలోనే ఇష్టారాజ్యంగా మాట్లాడతామంటే కుదరదన్నారు. ఒక జీవితం..రోడ్డు మీద వెళుతుంటే యాక్సిడెంట్ అయితే ప్రాణం పోద్దని, పోయే ముందు ప్రాణం తీస్తానని హెచ్చరించారు. బాధ్యత లేకుండా, ఒళ్లు తెలియకుండా విమర్శలు చేస్తే సహించబోననిపవన్ కల్యాణ్ అన్నారు.