Pawan Kalyan : పవన్ పట్ల కాపు సామాజికవర్గంలోనే అసహనం వ్యక్తమవుతుందా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నీతి నిజాయితీల పట్ల ఎవరికీ అనుమానం లేదు

Update: 2025-10-22 08:09 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నీతి నిజాయితీల పట్ల ఎవరికీ అనుమానం లేదు. అదే సమయంలో ఆయన మౌనం కూడా పార్టీని డ్యామేజీ చేస్తుందంటున్నారు. ప్రభుత్వ నిర్ణయాల విషయాల్లో కానీ, కొన్ని సంఘటనలపై కానీ పవన్ కల్యాణ్ సరైన రీతిలో స్పందించకుండా సైలెంట్ గా ఉండటం ప్రధానంగా జనసేన పార్టీ నేతలు, క్యాడర్ లోనూ అంతకంటే ముఖ్యంగా కాపు సామాజికవర్గంలోనూ అసంతృప్తి ఉంది. ప్రశ్నిస్తానని పార్టీని పెట్టిన పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ విషయాన్ని మరిచిపోయారన్న అభిప్రాయం ఎక్కువ మంది కాపు సంఘాల నేతలు కూడా వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పవన్ వైఖరిని ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతున్నారు.

ప్రభుత్వంలో భాగస్వామి కావడంతో...
కానీ పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో ఆయన భాగస్వామి. ఆయనే ప్రశ్నిస్తే ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతాయి. అదే సమయంలో కొన్ని కేసులకు సంబంధించి ప్రభావం చూపే అవకాశముంది. అయితే పవన్ కల్యాణ్ మాత్రం అంతర్గత సంభాషణల్లో రాష్ట్రంలో శాంతి భద్రతలు అంత బాగా లేవన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎక్కువగా అత్యాచారాలు, హత్యలు జరుగుతుండటం పట్ల ఆయన కలత చెందినట్లు పార్టీకి చెందిన ముఖ్య నేతలు చెబుతున్నారు. గతంలోనే హోం మంత్రి పదవిని తాను తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించిన పవన్ కల్యాణ్ తర్వాత పదుల సంఖ్యలో జరిగిన సంఘటనలపై మాత్రం బాహాటంగా స్పందించకపోవడాన్ని కాపు సంఘం నేతలు ప్రశ్నిస్తున్నారు.
బాహాటంగా ప్రశ్నించకున్నా...
అయితే పవన్ కల్యాణ్ కేవలం తాను కాపు సామాజికవర్గానికి సంబంధించిన నేతను కాదని, అన్నివర్గాలకు చెందిన నేతనని గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను కొన్నింటిని మంత్రి వర్గ సమావేశంలో ప్రశ్నిస్తున్నారని, కానీ బహిరంగంగా మాట్లాడే అవకాశం ఆయనకు ఇప్పుడు ఉండదని పార్టీ నేతలు చెబుతున్నారు. అయినా ఎప్పటికప్పుడు అన్యాయం జరిగితే వెంటనే స్పందిస్తున్నారని, అందుకు ఉదాహరణ భీమవరం డీఎస్పీ జయసూర్యపై చంద్రబాబుకు ఫిర్యాదు చేశారని ఉదహరిస్తున్నారు. సివిల్ వ్యవహారాల్లో తలదూరుస్తున్నారని, వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని మంత్రి నాదెండ్ల ద్వారా చంద్రబాబుకు సమాచారం అందించారని అంటున్నారు. అయినా సరే పవన్ కల్యాణ్ మాత్రం ఇంతకు ముందులా ఫోర్స్ గా లేకపోవడం, అన్యాయాన్ని ప్రశ్నించకపోవడంపై సొంత పార్టీ నేతలతో పాటు కాపు సామాజికవర్గం నుంచి కూడా విమర్శలను ఎదుర్కొనాల్సి వస్తుంది.


Tags:    

Similar News