Nagababu : నాగబాబుకు మంత్రి పదవి పై పవన్ క్లారిటీ ఇచ్చారుగా?
జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు మంత్రి పదవిపై పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు
జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు మంత్రి పదవిపై పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. తానే మంత్రి పదవిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చేవిషయంపై ఇప్పటి వరకూ చర్చ అంటూ ఏమీ జరగలేదని తెలిపారు. అయితే ఒక విషయం మాత్రం పవన్ కల్యాణ్ చెప్పారు. చంద్రబాబు నాయుడు తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకున్నారని, కానీ తాను మాత్రమే దీనిపై ఆలోచిస్తున్నానని చెప్పడంతో పవన్ కల్యాణ్ నిర్ణయం వవల్లనే నాగబాబుకు మంత్రి పదవి ఆగిందని అనుకోవాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇబ్బందులు తప్పవన్నకల్యాణ్ ఆగస్టులో పదవుల విస్తరణపై తుది నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.
తాజా వ్యాఖ్యలు వింటే...
పవన్ కల్యాణ్ తాజా వ్యాఖ్యలు వింటే నాగబాబుకు మంత్రి పదవి దక్కే అవకాశం కనిపించడం లేదు. కుటుంబంలోని వారికే పదవులు ఇస్తున్నారని, ఒకే సామాజికవర్గానికి పదవులను పంచుతున్నారన్న అపప్రధను తాను ఎదుర్కొనాల్సి వస్తుందని పవన్ కల్యాణ్ నాగబాబుకు మంత్రి పదవి విషయంలో ఆలోచిస్తున్నట్లు కనపడుతుంది. ఇప్పటికే జనసేనకు చెందిన ముగ్గురు మంత్రులుంటే అందులో ఇద్దరు కాపు సామాజికవర్గానికి చెందిన వారే. శాసనమండలిలో ఉన్న ఇద్దరు కూడా కాపు సామాజికవర్గానికి చెందిన వారే. ఇక మరో మంత్రి పదవి కూడా కాపు సామాజికవర్గానికి ఇస్తే తనపై కుల ముద్ర పడుతుందేమోనని పవన్ కల్యాణ్ భయపడుతున్నట్లు తెలిసింది.
ప్రయోజనం కూడా...
అందుకే చంద్రబాబు నాయుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని మీడియా సమావేశంలో ప్రకటించి ఇన్ని నెలలు అవుతున్నా జనసేనాని వెనక్కు తగ్గినట్లు తెలిసింది. నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చినందున పార్టీకి అదనంగా లభించే రాజకీయ ప్రయోజనం కూడా ఏమీ లేదని కూడా అంటున్నారు. ఎందుకంటే నాగబాబు కూడా ఫుల్ టైం పొలిటీషియన్ కాదు. ఏపీలో స్థిర నివాసం ఉండరు. ఇవన్నీ ఆలోచించి ఆయనకు ఇవ్వడం కంటే మరొక వ్యక్తికి పదవి ఇస్తే పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం అవుతుందని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లు కనపడుతుంది. నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చినా యాక్టివ్ గా లేకపోయినా, సరిగా పనితీరు కనపర్చకపోయినా తాను మాట పడాల్సి వస్తుందేమోనని వెనక్కు తగ్గినట్లు కనపడుతుంది. మొత్తం మీద ఏపీ కేబినెట్ లో ఖాళీగా ఉన్న ఒక్క పోస్టు వచ్చే నెలలో భర్తీ అవుతుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.