Naga Babu : నాగబాబు మంత్రి పదవి హుళక్కేనా? ఆయనకు పదవి ఇస్తే ఇన్ని సమస్యలా?

జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు మంత్రి పదవి విషయంలో పవన్ కల్యాణ్ పునరాలోచనలో పడినట్లు కనపిస్తుంది

Update: 2025-06-02 07:42 GMT

జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు మంత్రి పదవి విషయంలో పవన్ కల్యాణ్ పునరాలోచనలో పడినట్లు కనపిస్తుంది. నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడం వల్ల అనేక సమస్యలు తలెత్తే అవకాశముందని భావిస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కేబినెట్ లో జనసేన నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు. పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ లు ఉన్నారు. అందులో నాదెండ్ల మనోహర్ మినహాయిస్తే మిగిలిన ఇద్దరు కాపు సామాజికవర్గానికి చెందిన వారు. ిప్పుడు నాగబాబుకు కూడా పదవి ఇస్తే నలుగురిలో ముగ్గురు కాపు సామాజికవర్గానికి చెందిన వారికి మంత్రి పదవులు ఇచ్చినట్లవుతుంది. అది పార్టీకి కొంత ఇబ్బందిగా మారుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

కాపుల పార్టీగా ముద్రపడటం...
జనసేన అంటే ఒకే సామాజికవర్గానికి చెందిన పార్టీగా ముద్రపడటం ఇష్టంలేని పవన్ కల్యాణ్ నాగబాబు కు మంత్రి పదవి విషయంలో కొంత ఆలోచనలో పడినట్లు తెలిసింది. మరొకవైపు కాపు సామాజికవర్గానికి చెందిన ఇద్దరికి టీడీపీ కూడా మంత్రి పదవులు ఇచ్చింది. పొంగూరు నారాయణ, నిమ్మల రామానాయుడు కూడా కేబినెట్ లో ఉండటంతో ఎక్కువ మంది కాపులకు కేబినెట్ లో అవకాశం ఇచ్చినట్లవుతుందన్న భావన కలుగుతుందని చంద్రబాబు నాయుడు కూడా పవన్ తో చెప్పినట్లు తెలిసింది. చంద్రబాబు కేబినెట్ లో ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది. జూన్ నెలలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒక్క పదవిని ఖాళీగా ఉంచారు. వంగవీటి రాధాను ఎమ్మెల్సీగా ఎంపిక చేయకపోవడానికి కూడా అదే కారణమని అంటున్నారు.
ఒక సామాజికవర్గానికే...
ఈ పరిస్థితుల్లో నాగబాబును కేబినెట్ లోకి తీసుకుంటే ఇంకా ఇబ్బందులు ఏర్పడతాయని, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లు తెలిసింది. పార్టీ కోసం కష్టపడిన నాగబాబుకు ముందు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని అనుకున్నప్పటికీ ఇలాంటి డిస్కషన్స్ వల్ల పార్టీకి నష్టం చేకూరుతుందని, జనసేనను ఒక సామాజికవర్గానికి కట్టే ప్రయత్నం తామే చేసుకున్నట్లవుతుందని పవన్ కూడా నిర్ణయానికి వచ్చినట్లు కనపడుతుంది. అందుకే ఎమ్మెల్సీతో సరిపెడుతున్నారు. ముందుగా నాగబాబును రాజ్యసభకు పంపాలని అనుకున్నా, జనసేన తరుపున లింగమనేనిని పంపాలని నిర్ణయించడంతో నాగబాబును ఎమ్మెల్సీగా ఎంపిక చేశారంటున్నారు.
ముందుకు వెళ్లడంపై...
ఇప్పటివరకూ అందుతున్న సమాచారాన్ని బట్టి మంత్రి వర్గ విస్తరణ జూన్ 12వ తేదీ న గాని, తర్వాత గాని ఉండకపోవచ్చని టాక్ బాగా వినపడుతుంది. విస్తరణ నాగబాబు కోసమే పెట్టారన్న అభిప్రాయం కూడా ప్రజల్లో కలుగుతుందని, నాగబాబును తాము మంత్రిపదవిలోకి తీసుకుంటే బీసీలతో పాటు మిగిలిన సామాజికవర్గాల్లో కూడా ఆలోచన బయలుదేరి పార్టీని దూరం పెట్టే అవకాశముందని భావించి పవన్ కల్యాణ్ ఆలోచనలో పడినట్లు చెబుతున్నారు. అయితే పవన్ కల్యాణ్ ఒకసారి నిర్ణయం తీసుకున్నారంటే వెనక్కు తగ్గరు. మరి నాగబాబు విషయంలో ఇన్నిసమస్యలు వచ్చి పడతాయని తెలిసినా పవన్ ముందుకు వెళతారా? లేదా? అన్నది మరో పది రోజుల్లో తెలియనుంది.


Tags:    

Similar News