Zakia Khanam : జకియా ఖానం.. బీజేపీ లో చేరి ఏం సాధించారు?
ఎమ్మెల్సీ జకియా ఖానం గురించి 2020 వరకూ ఎవరికీ పెద్దగా తెలియదు. రాయచోటిలో సాధారణ పార్టీ కార్యకర్త మాత్రమే.
జకియా ఖానం గురించి 2020 వరకూ ఎవరికీ పెద్దగా తెలియదు. రాయచోటిలో సాధారణ పార్టీ కార్యకర్త మాత్రమే. అయితే జగన్ జకియా ఖానంకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. అప్పటి వరకూ అసలు రాజకీయాల్లో లేని జకియా ఖానం ఒక్కసారిగా ఎమ్మెల్సీ అయ్యారు. కడప జిల్లా కావడంతో పాటు జగన్ సొంత జిల్లాకు చెందిన వారు కావడంతో జకియా ఖానంకు ఎమ్మెల్సీ పదవి లభించింది. అందులో ఎవరికీ ఏ మాత్రం సందేహం లేదు. జకియా ఖానంను కేవలం ఎమ్మెల్సీతో సరిపెట్టలేదు. ఆమెను శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ గా కూడా చేశారు. నిజానికి జకియా ఖానం రాజకీయ జీవితంలో ఆ పదవి కూడా బహుశా ఊహించి ఉండరన్నది వాస్తవం.
వైసీపీలో లభించిన ప్రాధాన్యత...
జకియా ఖానంకు మరో పార్టీలో ఉన్నా ఇంతటి ప్రాధాన్యత దక్కే అవకాశం లేదన్నది ఎవరని అడిగినా చెబుతారు. కానీ 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలయిన తర్వాత అందరి నేతల్లాగనే జకియా ఖానం కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అప్పుడే జకియా ఖానం పార్టీ కి గుడ్ బై చెబుతున్నారని అర్ధమయింది. అయితే తిరుమల దర్శనం టిక్కెట్ల వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. జకియా ఖానం తొలుత తెలుగుదేశం పార్టీలోకి వెళ్లాలని భావించారు. కానీ తిరుమల టిక్కెట్ వ్యవహారంతో జకియా ఖానంను టీడీపీ దూరంగా ఉంచింది. ఇక జనసేనలో చేరడానికి కూడా జకియా ఖానం ప్రయత్నాలు తనవంతుగా బాగానే చేశారు.
జనసేనలో చేరాలనుకున్నా...
పవన్ కల్యాణ్ కడప జిల్లాకు వెళ్లినప్పుడు విమానాశ్రయం వద్దకు వెళ్లి ఆమెకు స్వాగతం పలికారు. అప్పుడు జనసేనలో జకియా ఖానం చేరతారాని భావించారు. కానీ జకియా ఖానం మాత్రం వైసీపీకి ఈరోజు ఉదయం రాజీనామా చేశారు. పార్టీతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు శాసనమండలి ఛైర్మన్ కు కూడా రాజీనామా లేఖలను సమర్పించారు. ఇదే సమయంలో ఆమె ఏ పార్టీలో చేరతారని అందరూ భావించారు. కానీ టీడీపీ, జనసేన పార్టీలు నో చెప్పడంతో జకియా ఖానం చివరకు బీజేపీని ఎంచుకున్నారు. బీజేపీలో ఈరోజు ఉదయం చేరిపోయారు. పార్టీ అధ్యక్షురాలు పురంద్రీశ్వరి సమక్షంలో జకియా ఖానం కమలం కండువా కప్పుకున్నారు. జకియా ఖానం బీజేపీ లో చేరినా వైసీపీ లో దొరికిన ప్రాధాన్యత లభిస్తుందా? అన్నది అనుమానమేనని సన్నిహితులు వ్యాఖ్యానించారు. ఇంతకూ జకియా ఖానం పార్టీ మారి ఏం సాధించినట్లు?