Modugula : మోదుగులలో ఆ హుషారు అందుకేనా.. జగన్ ఓకే అన్నారటగా

వైసీపీ అధినేత జగన్ ఈసారి ప్రయోగాలు చేయకూడదని భావిస్తున్నట్లుంది.

Update: 2025-10-11 09:05 GMT

వైసీపీ అధినేత జగన్ ఈసారి ప్రయోగాలు చేయకూడదని భావిస్తున్నట్లుంది. మరోసారి మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చేందుకు ఆయన సుముఖంగా ఉన్నారని సమాచారం. గత ఎన్నికల్లో మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి టిక్కెట్ దక్కలేదు. అయితే నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం నుంచి నెల్లూరు జిల్లాకు చెందిన అనిల్ కుమార్ యాదవ్ ను తీసుకు వచ్చి పోటీ చేయించగా ఆయన ఓటమి పాలయ్యారు. అయితే టిక్కెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి జగన్ మొండి చేయి చూపించారు. దీంతో ఆయన కొంత కాలం వ్యవసాయ పనులకే పరిమితమయ్యారు. తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అయ్యారు.

టీడీపీ నుంచి వైసీపీలోకి...
మోదుగుల వేణుగోపాల రెడ్డి ఫిబ్రవరి 2019 వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. 2014లో ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పోటీ చేసి గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుండి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై విజయం సాధించారు.. 2009 ఎన్నికల్లో ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని నరసరావుపేట నియోజకవర్గం నుండి 15వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. కానీ 2019 ఎన్నికల్లో మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి టీడీపీ టిక్కెట్ ఇవ్వకపోవడం, తాను ఆశించిన నరసరావుపేట పార్లమెంటు స్థానం దక్కకపోవడంతో ఆయన వైసీపీలో చేరారు. అయితే వైసీపీలో చేరినప్పటికీ ఆయనకు 2024 ఎన్నికల్లో టిక్కెట్ దక్కలేదు. 2019 లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఆయన ఎలాంటి పదవి దక్కలేదు.
పదేళ్ల నుంచి...
కానీ గత కొన్నాళ్ల నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీలో యాక్టివ్ గా మారారు. నరసరావుపేట పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయడానికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. అందుకే ఆయన హుషారుగా పార్టీలో కనిపిస్తున్నారంటున్నారు. ఇటీవల కాలంలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడమే కాకుండా గుంటూరు జిల్లా కార్యకర్తలతో కూడా తరచూ సమావేశం అవుతున్నారు. మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి పార్లమెంటు ఎన్నికల్లోనే పోటీ చేయాలన్న కాంక్ష ఉండటంతో ఆయన ఈసారి నరసరావుపేట నుంచి పోటీ చేయడం ఖాయమన్న ప్రచారం వైసీపీలో జోరుగా సాగుతుంది. మరి చివరి క్షణంలో ఏదైనా మార్పులు జరిగితే తప్ప మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి నరసరావుపేట ఎంపీ టిక్కెట్ ఖాయమన్న వార్తలు మాత్రం హల్ చల్ చేస్తున్నాయి.


Tags:    

Similar News