Rain Alert : అవి వెళ్లాయ్... ఇవి వచ్చాయ్...ఇంకో రెండురోజులు వర్షాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు నిష్క్రమించడంతో ఈ ప్రభావంతో తేలికపాటి జల్లులు, మోస్తరు వర్షాలు కొన్ని జిల్లాల్లో పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే బలమైన ఈదురుగాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు అంటే ఈ నెల 18వ తేదీ వరకూ వానలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేసింది. అయితే అతి భారీ వర్షాలు పడే అవకాశం లేదని, మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కొన్నిచోట్ల పిడుగులు పడే ఛాన్స్ ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది.
మరో రెండు రోజులు...
ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజుల పాటు వానలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. మే 26వ తేదీన ప్రవేశించిన రుతుపవనాలు నిన్నటితో నిష్క్రమించాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అయితే మరో రెండు రోజుల పాటు వానలు కురిసే అవకాశముందని కూడా వాతావరణ శాఖ చెప్పింది. అయితే మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు మాత్రమే పడతాయని పేర్కొంది. ఈదురుగాలులు మాత్రం వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ కోస్తా తీరం వెంట ముప్ఫయి ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలు విద్యుత్తు స్థంభాల వద్ద, హోర్డింగ్ లు, చెట్ల వద్ద నిల్చోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది.
ఈ నెల 18 వరకూ...
తెలంగాణలోనూ ఈ నెల 18వ తేదీ వరకూ మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో మోస్తరుగానూ, మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య రుతుపవనాలు దక్షిణాది రాష్ట్రాల్లోకి ప్రవేశించడంతో ఆ ప్రభావంతోనే వానలు కురుస్తాయని చెప్పింది. గత నాలుగైదు నెలలుగా వానలు రెండు తెలుగు రాష్ట్రాలను ముంచెత్తాయి. అయితే ఈశాన్య రుతుపవనాల వల్ల భారీ వానలు పడే అవకాశముండకపోవచ్చన్నది అధికారుల అంచనా.