Rain Alert : ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం.. అలెర్ట్ గా ఉండాల్సిందే
భారీ నుంచి అతి భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలలో పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలలో పడతాయని పేర్కొంది. ఆదివారం వరకు కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీవర్షాల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాయలసీమ, కోస్తా జిల్లాలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. సముద్రం అలజడిగా ఉంటుందని, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తీరాల్లో అలలు 2.9 నుంచి 3.6 మీటర్ల ఎత్తులో ఎగసిపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
మత్స్యకారులు చేపలవేటకు...
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం అప్రమత్తమయింది. సోమవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని సూచించింది. వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రమాద హాట్ స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించింది.అత్యవసర సహాయక చర్యలకు కంట్రోల్ రూమ్ లో 112, 1070, 18004250101 టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేసింది. కోస్తా తీర ప్రాంతంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అలెర్ట్ గా ఉండాలని, అవసరమైతే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎస్.డి.ఆర్.ఎఫ్ బృందాలను కూడా సిద్ధంగా ఉంచాలని కూడా ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది.
రానున్న నాలుగు రోజులు...
తెలంగాణలోనూ రానున్న నాలుగు రోజుల పాటు తేలిక పాటి నుంచి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని చెప్పింది. బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెప్పింది.కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశముందనివాతావరణ శాఖ హెచ్చరించింది.