Rain Alert : ఈ కాలంలో వర్షాలు ఎందుకు పడుతున్నాయో మీకు తెలుసా?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో రెండు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

Update: 2025-10-09 04:36 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో రెండు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ద్రోణి ప్రభావంతో వానలు కురుస్తాయని చెప్పింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు..మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడతాయని చెప్పింది. రుతుపవనాలు తిరోగమన దిశలో పయనిస్తుండగా ప్రస్తుతం వర్షాలు పడతాయని తెలిపింది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వాగులు, వంకలు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయని ఎవరూ దాటే ప్రయత్నం చేయవద్దని కూడా సూచించింది. రెండు రాష్ట్రాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు ఉంటాయని, సాయంత్రం వేళకు ఉక్కపోతతో పాటు వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది.

ఏపీలో రెండు రోజులు...
ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ప్రధానంగా ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని, కోస్తాంధ్రలో మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడే అవకాశముందని చెప్పింది. రాయలసీమ ప్రాంతంలో చిరుజల్లులు పడే అవకాశముందని తెలిపింది. అయితే కొన్ని ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని, గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. తీరం వెంట గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, హోర్డింగ్ లు, చెట్ల కింద నిలబడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.
ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్...
తెలంగాణలోనూ రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్,ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, హనుమకొండ, సిద్ధిపేట, జనగాం, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు తెలంగాణలోని ఇరవై మూడు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని పేర్కొంది.


Tags:    

Similar News