Rain Alert : అక్టోబరు వచ్చినా.. వదలని వానలు.. కారణం ఇదేనా?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ద్రోణి ప్రభావంతో్ నాలుగు రోజులు కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆగస్టు, సెప్టంబరు నెలల్లోనూ వానలు దంచి కొడుతున్నాయి. క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడటంతో పాటు ఫ్లాష్ ఫ్లడ్స్ తో అనేక ప్రాంతాలు తడిసి ముద్దవుతున్నాయి. అదే సమయంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలోని పంటలన్నీ చేతికి అందకుండా పోయాయి. ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులకు నీరు చేరి వరదలతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
వాగులు దాటొద్దు...
ఆంధ్రప్రదేశ్ లోనూ మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. వాగులు, నదులు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించింది. ప్రమాదకరంగా ప్రవహిస్తున్నందున ఎవరూ అతి విశ్వాసానికిపోయి దాటే ప్రయత్నం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు. పల్నాడు, గుంటూరు, కోనసీమ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విశాఖ, విజయనగరం జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. ఇక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. ఇక నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని విశాఖవాతావరణ శాఖ వెల్లడించింది.
నాలుగు రోజులు పాటు...
తెలంగాణ రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. జనగామ, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజ్ గిరి, సిద్ధిపేట, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డిలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. ఈరజు జోగులాంబ గద్వాల్, నారాయణపేట్, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట్, నల్లగొండ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.