Weather Report : కుండపోత కురవాల్సిన సమయంలో ఉక్కపోత.. ముందున్నాయట వానలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది

Update: 2025-07-17 04:05 GMT

బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వరస అల్పపీడనాల ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేరకొంది. నైరుతి రుతుపవనాల కాలంలోనూ వేడి తగ్గలేదు. ఉపరితల ఆవర్తనాల ప్రభావం కారణంగా ఈ సంవత్సరం ప్రారంభంలోనేై వడగాలుల తీవ్రత తగ్గి, వేసవి ముందుగానే పూర్తయింది. ఎండ తాపం నుంచి ప్రజలు ఉపశమనం పొందారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పొడి వాతావరణం వల్ల వారం రోజులుగా వర్షాకాలంలో కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వేడి, ఉక్కపోత పరిస్థితులు నెలకొన్నాయి. పశ్చిమ బెంగాల్ నుంచి ఉత్తరప్రదేశ్ వరకు వెనువెంటనే అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. ఈ కారణంగా తేమ అక్కడే ఉండి పోవడం వల్ల దిగువ ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

అత్యధికంగా నమోదవుతూ...
పల్నాడు జిల్లాలో అత్యధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో 39 డిగ్రీలకు పైగా నమోదవుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు ప్రజలను ఇబ్బందిపెడుతున్నాయి. పల్నాడు జిల్లాలో అయితే నలభై డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వాతావరణ శాఖ చెప్పింది. కళింగపట్నం, విశాఖపట్నం, తుని, కాకినాడ, నరసాపురం, మచిలీపట్నం, గన్నవరం, బాపట్ల, కడప వంటి తదితర ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 7 డిగ్రీల వరకు పెరిగాయని విశాఖ వాతావరణ శాఖ చెప్పింది.
ఉక్కపోత.. ఉష్ణోగ్రతలు...
విజయవాడ, విశాఖ నగరాల్లో ఎండ తీవ్రతకు బయటకు వెళ్లాలంటేనే జనం భయపడుతున్నారు. ఏసీలు, కూలర్లపైనే ఎక్కువ ఆధారపడుతున్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ నెల 18వ తేదీ తర్వాత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అనుకుంటుంది. ఉత్తర భారతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో గంగా పరివాహక పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్‌ పరిసరాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది మంగళవారం నాటికి పశ్చిమ-వాయవ్య దిశగా గంగా పరివాహక పశ్చిమబెంగాల్‌ మీదుగా కదలనుందని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలోనూ భారీ వర్షాలు...
తెలంగాణలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న మూడు రోజుల్లో బంగాళాఖాతంలో వరస అల్పపీడనాలు ఏర్పడే అవకాశమున్నందున వీటి ప్రభావం కారణంగా ఈ నెల 17 నుంచి 19 వరకూ, తిరిగి 23వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు గంటలకు ముప్పయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా తెలిపింది. జోగులాంబ గద్వాల్, నారాయణపేట్, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాాద్, రంగారెడ్డి, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని, ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.


Tags:    

Similar News