Road Accident : కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం.. 20 మందికి పైగా మృతి

ఆంధ్రప్రదేశ్ లో ఘోర విషాదం జరిగింది. బస్సు దగ్దమై ఇరవై మందికిపైగా సజీవదహనమయ్యారు

Update: 2025-10-24 02:25 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఘోర విషాదం జరిగింది. బస్సు దగ్దమై ఇరవై మందికిపైగా సజీవదహనమయ్యారు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌–బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్‌ బస్సు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 20 మందికిపైగా ప్రయాణికులు మృతి చెందగా, 12 మందికి గాయాలయ్యాయి. బస్సులో మొత్తం 42 మంది ఉన్నారని పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలిసింది. హైదరాబాద్‌–బెంగళూరు ప్రైవేట్‌ బస్సుకు మంటలు అంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాదానికి కారణం...
ఇంధన ట్యాంక్‌ తాకడంతో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్దమయిందని చెబుతున్నారు. వెనుక నుంచి వస్తున్న ద్విచక్ర వాహనం బస్సును ఢీకొట్టడంతో అది ఇంధన ట్యాంక్‌ను తాకింది. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సంతా మంటల్లో చిక్కుకుపోయిందని స్థానికులు తెలిపారు. ఎక్కువ మంది ప్రయాణికులు హైదరాబాద్‌కు చెందినవారని సమాచారం. బస్సు ప్రమాదం సంభవించిన సమయంలో ప్రయాణికులందరూ నిద్రలో ఉన్నారు. నిద్రలోనే తమ ప్రాణాలను విడిచారు. గాయపడిన వారిని వెంటనే కర్నూలు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సహాయక చర్యల్లో...
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని రక్షణ చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తెలంగాణ సీఎం ఏ. రేవంత్‌రెడ్డి ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గడ్వాల్‌ కలెక్టర్‌, ఎస్పీని ఘటనాస్థలికి వెళ్లాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌ సీఎం ఎన్‌. చంద్రబాబు నాయుడు కూడా ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత జగన్ కూడా తన సంతాపాన్ని ప్రకటించారరు.


Tags:    

Similar News