TDP : కొలికపూడి తాడో పేడో తేల్చుకోవడానికే రెడీ అయ్యారా?

విజయవాడ పార్లమెంటు సభ్యుడికి, తిరువూరు నియోజకవర్గం టీడీపీ నేతకు అసలు ఎప్పుడూ వివాదాలే నడుస్తున్నాయి

Update: 2025-10-24 08:07 GMT

విజయవాడ పార్లమెంటు సభ్యుడికి, తిరువూరు నియోజకవర్గం టీడీపీ నేతకు అసలు ఎప్పుడూ వివాదాలే నడుస్తున్నాయి. గతంలోనూ విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని, అప్పటి టీడీపీ ఇన్ ఛార్జి దేవదత్ కు మధ్య పొసగలేదు. ఇప్పుడు కూడా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిల మధ్య వివాదం పీక్స్ కు చేరుకున్నాయి. ఇద్దరూ తొలిసారిగా చట్ట సభల్లో అడుగుపెట్టిన వారే. కొలికపూడి శ్రీనివాస్ అమరావతి ఉద్యమంలో రైతుల పక్షాన నిలబడి ఒక పథకం ప్రకారం సామాజికవర్గం నేతగా పాపులర్ అయి తిరువూరు టిక్కెట్ దక్కించుకున్నారు. అలాగే కేశినేని చిన్ని కూడాతన సోదరుడు కేశినేని నానితో విభేదించి టీడీపీలో కీలకంగా మారి విజయవాడ పార్లమెంటు స్థానాన్ని దక్కించుకున్నారు.

ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే...
అయితే గత కొన్నాళ్ల నుంచి తిరువూరులో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా వార్ నడుస్తుంది. ఏ రేంజ్ లో అంటే వేర్వేరు కార్యక్రమాలను ఎవరికి వారే నిర్వహిస్తున్నారు. అయితే కొలికపూడి వరసగా తిరువూరులో వివాదాల్లో చిక్కుకోవడంతో పార్టీ నాయకత్వం అక్కడి బాధ్యతలను చక్కబెట్టే పనిని కేశినేని చిన్నికి అప్పగించింది. అప్పటి నుంచి కొలికపూడి శ్రీనివాస్ నియోజకవర్గంలో నామమాత్రంగానే మారారు. నామినేటెడ్ పదవుల నుంచి, పార్టీ పదవుల వరకూ కేశినేని చిన్ని చెప్పిన వారికే దక్కుతున్నాయి. ఇది కొలికపూడి శ్రీనివాస్ ఆగ్రహానికి కారణమయింది. అయితే నిన్న ఇద్దరూ వేర్వేరు కార్యక్రమాలకు తిరువూరులో నిర్వహించడంతో మరింత వివాదానికి దారితీసింది.
ఐదు కోట్లు అడిగారంటూ...
కొలికపూడి శ్రీనివాస్ ఏకంగా కేశినేని చిన్నిపై సంచలన ఆరోపణలు చేశారు. గత ఎన్నికల సమయంలో కేశినేని చిన్ని తన నుంచి ఐదు కోట్లు డిమాండ్ చేశారని, సీటు కావాలంటే కోట్లు ఇవ్వాల్సిందేనని షరతు పెట్టారని సోషల్ మీడియా వేదికగా కొలికపూడి శ్రీనివాస్ ఆరోపించారు. తాను ఐదుకోట్ల రూపాయలను దశల వారీగా చిన్నికి అందించినట్లు వాట్సాప్ లో బ్యాంక్ స్టేట్ మెంట్ ను కూడా బయటపెట్టారు. తాను ఎవరెవరెవరికి ఎంత ఇచ్చారో కూడా క్లియర్ గా కొలికపూడి శ్రీనివాస్ చెప్పడంతో వివాదం రచ్చ కెక్కినట్లయింది. తెలుగుదేశం పార్టీలో ఇది హాట్ టాపిక్ గా మారింది. గతంలోనే కొలికపూడి శ్రీనివాస్ అనేక వివాదాల్లో చిక్కుకున్నప్పుడు సాక్షాత్తూ చంద్రబాబు పిలిచి మందలించారన్న వార్తలొచ్చారు.
చంద్రబాబు వచ్చిన తర్వాత...
కొలికపూడికి అంత ఆర్థికస్థోమత లేదని, కావాలనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని కేశినేని చిన్ని అంటున్నారు. కొలికపూడి శ్రీనివాస్ పై మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన తిరువూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు ఆయనపై హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. క్రమశిక్షణ సంఘం ఎదుటకు కూడా కొలికపూడి శ్రీనివాస్ హాజరై వివరణ ఇచ్చారు. ఇక వివాదానికి ఫుల్ స్టాప్ పడిందనుకుంటున్న తరుణంలో తాజాగా జరిగిన రచ్చ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా తయారయింది. దీంతో పార్టీ నాయకత్వం నేడు పార్టీ కేంద్ర కార్యాలయానికి రావాలని కొలికపూడి శ్రీనివాస్ ను ఆదేశించింది. అయితే చంద్రబాబు ఆదేశాలతో పల్లా శ్రీనివాసరావు పార్టీ కార్యాలయానికి రావద్దని తెలిపారు. చంద్రబాబు విదేశీ పర్యటన వచ్చిన తర్వాత ఈ పంచాయతీపై స్వయంగా చంద్రబాబు దృష్టి పెట్టనున్నారు. మొత్తం మీద తేలేదేందంటే కొలికపూడి తాడోపేడో తేల్చుకోవడానికే సిద్ధమయినట్లు కనిపిస్తుంది.


Tags:    

Similar News