కరీంనగర్ వెండి కళాకృతులు

కరీంనగర్ వెండి తీగ నగిషీ (సిల్వర్ ఫిలిగ్రీ) జీ 20 సదస్సుకు హాజరవుతున్న ప్రపంచ దేశాల నేతలను ఆకట్టుకోనుంది.

Update: 2023-09-08 17:16 GMT

కరీంనగర్ వెండి కళాకృతులు

కరీంనగర్ వెండి తీగ నగిషీ (సిల్వర్ ఫిలిగ్రీ) జీ 20 సదస్సుకు హాజరవుతున్న ప్రపంచ దేశాల నేతలను ఆకట్టుకోనుంది. ఢిల్లీ వేదికగా శని, ఆదివారాలలో రెండు రోజులపాటు జరిగే సదస్సుకు హాజరయ్యే అతిథులకు బ్యాడ్జీలుగా అలంకరించనున్నారు. ఇందుకు అశోక చక్రం చిహ్నంతో ఉన్న 200 వెండి తీగ వస్తువులను కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాకారులు తయారు చేసి పంపించారు. ఒక్కొక్కటి 12 గ్రాముల వెండితో స్థానిక కళాకారులు ఈ బ్యాడ్జీలను తయారు చేశారు. తెలంగాణ హస్తకళల అభివృద్ధి సంస్థ బ్యాడ్జీలు తయారు చేసే పని కరీంనగర్ కళాకారులకు అప్పగించింది. ఇందుకోసం సుమారు రూ.8 లక్షలు వెచ్చించింది.

ఫిలిగ్రీకి అంతర్జాతీయ గుర్తింపు

వెండి తీగలతో అద్భుతమైన కళాకృతులు తయారు చేసే ఫిలిగ్రీ పరిశ్రమ ద్వారా కరీంనగర్ జిల్లా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. సృజనాత్మకత, ఏకాగ్రత, కలగలిసి వెండి తీగలతో ఇక్కడి కళాకారులు అద్భుతమైన ఆకృతులు రూపొందించడంలో రాష్ట్ర, జాతీయస్థాయిలో విదేశీ ప్రముఖుల పర్యటనల్లో వారికి బహుమానంగా అందించేందుకు కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రి వస్తువులను కొనుగోలు చేయడం పరిపాటిగా మారింది.

సుమారు 300 సంవత్సరాల నాటి ఈ కళకు స్థానిక కళాకారులు మళ్లీ జీవం పోశారు. కరీంనగర్ కేంద్రంగా 250 మందికి పైగా కళాకారులు ఈవృత్తిపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. ప్రతి ఏటా సిల్వర్ ఫిలిగ్రీ కళాకృతుల అమ్మకం రూ.10 కోట్ల మేర ఉంటుందని ఓ అంచనా. కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాకారులు 2007లోనే జియోగ్రాఫికల్ ఇండికేషన్ గుర్తింపు పొందారు.

అమెరికా, సింగపూర్, బ్రిటన్ తో పాటు గల్ఫ్ దేశాలలో కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ ఉత్పత్తుల విక్రయాలు కొనసాగుతున్నాయి. జీ20 సదస్సులో ప్రపంచ దేశాల నేతల కోటు జేబులపై ఫిలిగ్రీ ఉత్పత్తులు సగర్వంగా మెరవనున్నాయి.

Tags:    

Similar News