JanaSena : పవన్ జనసైనికులను ఏం చేయాలనుకుంటున్నారు? .

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాతికేళ్లు రాజకీయాలు చేయానికి ప్రజల్లోకి వచ్చారు.

Update: 2025-06-17 07:57 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాతికేళ్లు రాజకీయాలు చేయానికి ప్రజల్లోకి వచ్చారు. పార్టీ పెట్టారు. ఇప్పటికే పార్టీ పెట్టి పదేళ్లు దాటి పోయింది. తొలిసారి జనసేన అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది. అయితే దాదాపు పదేళ్ల నుంచి పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టకపోవడంతో పార్టీ కార్యకర్తలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. నిజంగా ఒక రాజకీయ పార్టీకి కార్యకర్తలతో పాటు పార్టీ నిర్మాణం ముఖ్యం. కార్యకర్తలు నేరుగా అగ్రనేతలను కలిసే అవకాశముండదు. అందుకే గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకుంటే ఆ నేతలను సంప్రదించి తమ పనులను చక్కపెట్టుకోవడానికి ఏ పార్టీ కార్యకర్తకయినా వీలుంటుంది.

నిర్మాణం లేని పార్టీగా...
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, వైసీపీ, బీజేపీలకు పార్టీ నిర్మాణం పటిష్టంగా ఉంది. బీజేపీ ఓటు బ్యాంకు తక్కువే అయినప్పటికీ ఆ పార్టీకి గ్రామ స్థాయి నుంచి నేతలున్నారు. వారికి ఒక గుర్తింపు ఉంటుంది. ఇక టీడీపీ, వైసీపీ సంగతి చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే రెండు పార్టీలు క్షేత్రస్థాయిలో బలమైన పార్టీలు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి బలం, బలగం ఉన్న పార్టీలవి. జనసేనకు బలగం రాష్ట్రంలో ఉన్నప్పటికీ దానిని లీడ్ చేసే వారు మాత్రం లేరు. ఎందుంకటే ఒక గ్రామంలో జనసేన పార్టీ కార్యకర్తకు కష్టం వచ్చినా, సమస్య చెప్పుకోవాలనుకున్నా ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి పదేళ్లవుతున్నా నిర్మాణంపై దృష్టి పెట్టలేదు.
ఆ భయంతో పదవులను...
పదవులను అప్పగిస్తే వాటిని దుర్వినియోగం చేస్తారన్న భయంతో నిర్మాణం చేపట్టలేదన్నవాదనలో కొంత నిజమున్నా పార్టీ మరింత బలోపేతం కావాలంటే ఖచ్చితంగా నిర్మాణం అవసరం. ఒక మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీలో చేరాలనుకున్నా ఎవరిని సంప్రదించాలన్నది ఎవరికీ అర్థం కాకుండా ఉంది. పవన్ కల్యాణ్ అందరికీ అందుబాటులో ఉండరు. అదే సమయంలో తర్వాత స్థానంలో ఉన్న నేతలతో సంప్రదించాలన్నా అది సాధ్యపడటం లేదు. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి తమ గోడు చెప్పుకున్నా కొందరికి మాత్రమే పవన్ తర్వాత నేతల దర్శనమవుతుంది. అందరికీ సాధ్యపడటం లేదు. దీంతో జనసైనికుల్లో నీరసం ఆవహించింది.
2024 ఎన్నికలకు ముందున్న...
మరోవైపు 2024 ఎన్నికలకు ముందున్న ఉత్సాహం కూడా జనసైనికుల్లో కనిపించడం లేదు. పవన్ కల్యాణ్ బయటకు వచ్చినప్పటికీ ఆయన సినీ అభిమానులు మినహా నిజమైన జనసైనికులు పెద్దగా రావడం లేదన్న వార్తలతోనైనా పవన్ కల్యాణ్ స్పందించాలంటున్నారు. కనీసం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నప్పటికీ తమకు కావాల్సిన పనులను చేయించుకోవడానికి ఎవరిని సంప్రదించాలో తెలియని అయోమయంలో జనసైనికులు ఉన్నారంటే వారి పరిస్థితులను వేరే చేప్పాల్సిన పనిలేదు. అందుకే జనసైనికుల్లో ప్రస్తుతం అసంతృప్తి బాగా పేరుకుపోయిందని అనేక సర్వేల్లో వెల్లడవుతుంది. తాము పడిన కష్టాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదన్న నిరాశ ఎక్కువగా గ్రౌండ్ లెవెల్ లో కనిపిస్తుంది. పవన్ ఇప్పటికైనా మేలుకోకపోతే.. తర్వాత రాజకీయంగా ఇబ్బందులు తప్పవంటున్నారు.
Tags:    

Similar News