Janasena : జగన్ ను తొక్కేయాలని... తానే పడిపోతున్నారా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీని సొంతంగా విస్తరించేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదు

Update: 2025-09-08 09:02 GMT

ఏ రాజకీయ పార్టీ అయినా సొంత శక్తితో ఎదగాలి. కలసి ప్రయాణం చేస్తే ఎదుగుదల కష్టం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కొన్ని దశాబ్దాలుగా సొంతంగా ఎదగలేకపోవడానికి కారణం టీడీపీతో పొత్తు పెట్టుకోవడమేనని ఆ పార్టీ నేతలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తుంటారు. అదే సమయంలో రాష్ట్ర విభజన జరిగిన అనంతరం సొంతంగా పోటీ చేసి బీజేపీ ఇప్పుడు స్ట్రాంగ్ గా తయారైంది. 119 నియోజకవర్గాల్లో బలమైన క్యాడర్ తో పాటు లీడర్లను కూడా ఏర్పాటు చేసుకుంది. అదే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చే సరికి ఎక్కడా ఎదగలేదు. కేవలం ఒక్కశాతం ఓట్లకే పరిమితమయింది. టీడీపీతో కలిస్తే తప్ప అది ఎక్కడైనా విజయం సాధించలేని పరిస్థితి నెలకొంది. ఇది ఆ పార్టీ నేతలే అంగీకరిస్తుంటారు.

జనసేన రాష్ట్రంలో...
జనసేనకు కూడా త్వరలో అదే పరిస్థితి పట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీని సొంతంగా విస్తరించేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదు. 2014లో పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించారు. 2019 ఎన్నికలకు వచ్చే సరికి జనసేనకు అతి తక్కువ శాతం ఓట్లు వచ్చాయి. ఎక్కడా గెలవలేదు. చివరకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసిన గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో కూడా ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఇక 2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలసి కూటమిలా ఏర్పడి పోటీ చేశాయి. దీంతో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రయిక్ రేట్ తో విజయం సాధించారు. అంటే జనసేన బలానికి టీడీపీ ఓట్లు తోడవ్వడం వల్లనే ఈ గెలుపు సాధ్యమయిందన్నది అందరికీ తెలిసిందే.
పదిహేనేళ్ల పాటు కలసి పోటీ చేస్తే...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరో పదిహేనేళ్ల పాటు కూటమి కలసి ఉంటుందని పదే పదే చెబుతున్నారు. దీంతో జనసేన పార్టీ కూడా మరో బీజేపీలా తయారవుతుందన్న కామెంట్స్ ఆ పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో, ఎక్కువ నియోజకవర్గాల్లో జనసేనకు సరైన నాయకత్వం లేదు. నాయకత్వాన్ని పెంచుకుని, ఓటు బ్యాంకు ను పెంపొందిచుకునే ప్రయత్నం జనసేనాని చేయడం లేదు. కేవలం కొన్ని జిల్లాలకే జనసేన పరిమిత మయింది. ఆ జిల్లాల్లోనూ కొన్ని నియోజకవర్గాల్లోనే కొంత బలంగా ఉంది. మొత్తం 175 నియోజకవర్గాలున్న ఆంధ్రప్రదేశ్ లో కనీసం యాభై నియోజకవర్గాల్లోనూ జనసేన బలంగా లేదన్నది ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్న విషయం.
మర్రిచెట్టు నీడలో...
మరొకవైపు ఇదే పద్ధతిలో టీడీపీతో కలసి నడిస్తే మర్రిచెట్టు నీడన మరొక మొక్క మొదలవదన్న రీతిలో టీడీపీ నీడలో ఏ పార్టీ ఎదగలేదన్నది అంతే సత్యం. 2009 లో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి సొంతంగా పోటీ చేసి పద్దెనిది స్థానాల్లో నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విజయం సాధించారు. అదే చిరంజీవి ప్రజారాజ్యాన్ని 2014 ఎన్నికల్లో పెట్టి పోటీ చేసి ఉంటే ఎక్కువ స్థానాలను గెలుచుకునే వారన్న అంచనాలున్నాయి. అయితే పవన్ కల్యాణ్ మాత్రం కేవలం జగన్ ఓడించాన్న కసితో తన పార్టీని టీడీపీకి పణంగా పెట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ నేతలు నియోజకవర్గంలో మరొక పార్టీ నేతను ఎదగనివ్వరు. రానున్న కాలంలో జనసేన మరింత బలహీన పడే అవకాశముందన్న అంచనాలు వినపడుతున్నాయి. మరి పవన్ కల్యాణ్ నిర్ణయం, వ్యూహం ఏ మేరకు వర్క్ అవుట్ అవుతుందన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News