Janasena Party : అంతా ఫీల్ గుడ్ ఫ్యాక్టరేనా... తప్పులు అస్సలు కనిపించవా తమ్ముడూ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు రాష్రంలో అంతా మంచి జరుగుతుందని భావిస్తున్నారు. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తో ఉన్నారు

Update: 2025-08-20 07:55 GMT

అధికారంలో ఉన్నవారికి అంతా బాగున్నట్లే కనపడుతుంది. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఎక్కువగా వినిపిస్తుంది. అది ఎవరైనా కావచ్చు. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేసే తప్పొప్పులు కనిపించవు. అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం అధికార పార్టీ చేసే ప్రతి పని తప్పుగానే కనపుడుతుంది. కానీ తాము అధికారంలో ఉన్నప్పుడు మాత్రం అంతా అభివృద్ధి కనిపిస్తుంది. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయలోనూ అదే జరుగుతుంది. కూటమిలో ఉన్నప్పుడు అధికార పార్టీని విమర్శించడం సబబు కాదు. అలాగని ప్రతి విషయంలో తలూపడం కూడా అంత కరెక్ట్ కాదన్నది సొంత పార్టీ జనసేన నేతల నుంచి వినిపిస్తున్న మాట. ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ ఎలా ఉన్నారో అలాగే ఉండాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

స్మార్ట్ మీటర్ల విషయంలో...
కూటమి ప్రభుత్వం ఏర్పాటయి దాదాపు పదమూడు నెలలు గడిచిపోతుంది. ఈ పదమూడు నెలల కాలంలో అనేక విషయాల్లో ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ ప్రజలు ఆందోళన బాట పడుతున్నారు. వైసీపీ నిరసనలు చేపట్టడం వేరు, అది రాజకీయ కోణంలో చూడాలి. కానీ కమ్యునిస్టు పార్టీల నుంచి వచ్చే ప్రశ్నలకు పవన్ కల్యాణ్ కూడా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. స్మార్ట్ మీటర్ల విషయంలో సీపీఎం పెద్ద యెత్తున ఆందోళన గత కొంతకాలం నుంచి చేస్తుంది. అయితే స్మార్ట్ మీటర్ల విషయంలో ప్రభుత్వం ముందుకు వెళుతూనే ఉంది. దీనిని ఏ పరిస్థితుల్లోనూ పవన్ కల్యాణ్ అభ్యంతరం చెప్పకపోవడాన్ని కూడా పలువురు సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు.
స్టీల్ ప్లాంట్ సమస్యపై...
మరొకవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్నప్పటికీ, మరొక స్టీల్ ప్లాంట్ ను అదే జిల్లాలో నెలకొల్పడంతో పాటు ఆ ప్రయివేటు స్టీల్ ప్లాంట్ కు గనులు కేటాయించాలని కోరడం పై సీపీఐ కూడా అభ్యంతరం చేసింది. అలాగే విశాఖపట్నంలోని కొన్ని విభాగాలు ప్రయివేటు పరం చేస్తూ యాజమాన్యం నోటిఫికేషన్ విడుదల చేసిందని స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా నిలిచిన పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం వారిని పట్టించుకోకుండా, కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని సమర్ధించడమేంటని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అందుకే పవన్ కల్యాణ్ చరిష్మా ఎన్నికలకు ముందు ఒకలా.. తర్వాత ఒకలా మారిందన్న కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News