Byreddy Sidhardh Reddy : బైరెడ్డికి జగన్ బంపర్ ఆఫర్.. ఈసారి మామూలుగా ఉండదట
వైసీపీలో యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి వైసీపీ చీఫ్ జగన్ ఖచ్చితమైన హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది
వైసీపీలో యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి వైసీపీ చీఫ్ జగన్ ఖచ్చితమైన హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. అందుకే నిన్న మొన్నటి వరకూ కొంత మౌనంగా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇప్పుడు తిరిగి యాక్టివ్ అయ్యారని తెలిసింది. వచ్చే ఎన్నికలలో చట్టసభలకు పంపుతానని బైరెడ్డికి హామీ ఇవ్వడంతో ఆయన వర్గం కూడా ఇప్పుడు జిల్లాలో యాక్టివ్ అయింది. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ప్రసంగాలు కూడా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. వైసీపీలో ఉంటున్నప్పటికీ ఆయనకు ఇప్పటి వరకూ చట్టసభల్లో పోటీ చేసే అవకాశం దక్కలేదు. కానీ ఈసారి పోటీ చేసేందుకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సిద్ధమవుతున్నారట. నిన్న మొన్నటి వరకూ కర్నూలు, నంద్యాల జిల్లాలకు జగన్ వచ్చినప్పటికీ కనిపించని బైరెడ్డి ఇప్పుడు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
యాక్టివ్ అయింది అందుకేనా?
అంతేకాదు ఇటీవల పార్టీ నేత, వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డిని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రాజమండ్రి జైలుకు వెళ్లి కలసి వచ్చారు. వైసీపీ నేతగా ఆయన కూటమి పాలనపై సెటైర్లతో కూడిన పంచ్ లు వేస్తున్నారు. గతంలో వైసీపీ హయాంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి చట్టసభల్లో స్థానం కల్పించలేకపోయినా శాప్ ఛైర్మన్ పదవిని జగన్ అప్పగించారు. యువతలో మంచి క్రేజ్ ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈసారి మాత్రం పోటీ చేయడం ఖాయమని అంటున్నారు. అందుకే జగన్ ను తాను వదిలిపెట్టే ప్రసక్తిలేదని, కేసులకు భయపడపోనని కూడా ఆయన అంటున్నారు. జగన్ ను కలసి వచ్చిన తర్వాతనే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిలో ఈ మార్పు కనిపించిందంటున్నారు. బెంగళూరుకు ప్రత్యేకంగా పిలిపించుకున్న జగన్ బైరెడ్డికి స్పష్టమైన హామీ ఇచ్చారంటున్నారు.
ఎక్కడని వెతికితే...
అయితే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని శాసనసభకు పంపుతారా? పార్లమెంటు సీటు ఇస్తారా? అన్నది మాత్రం బయటకు రాకున్నా ఏదో ఒక చోట సీటు గ్యారంటీ అని అంటున్నారు. ప్రధానంగా ఆయన కర్నూలులో పోటీ చేయాలనుకున్నా అక్కడ ఎస్.వి.మోహన్ రెడ్డి కుటుంబం ఉంది. అక్కడ ముస్లింలకు కూడా అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక నంద్యాలలో శిల్పా రవిచంద్రారెడ్డి ఉన్నారు. ఇక శ్రీశైలంలో పోటీ చేయాలన్నా అక్కడ శిల్పా చక్రపాణిరెడ్డి ఉన్నారు. పాణ్యంకు వెళ్లాలంటే అక్కడ సీనియర్ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి ఉన్నారు. అంటే ఈ నాలుగు స్థానాల్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి పోటీ చేసే అవకాశాలు లేవన్నది ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి తెలుస్తోంది.
సోదరితో పోటీ పడాలని...
ఇక ఆయనకు మిగిలింది నంద్యాల పార్లమెంటు నియోజకవర్గమే. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలోనూ పోచా బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. ఆయనకు పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యసభకు పంపుతామని జగన్ హామీ ఇచ్చి నంద్యాల పార్లమెంటు స్థానాన్ని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఇచ్చేందుకు అంగీకరించినట్లు పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమచారాన్ని బట్టి తెలిసింది. నంద్యాల నియోజకవర్గంలో తరచూ పర్యటిస్తూ కార్యకర్తలకు, నాయకులతో టచ్ లో ఉండాలని జగన్ చేసిన సూచనలతో ఆయన త్వరలో పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో పర్యటిస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం తన సోదరి బైరెడ్డి శబరి నంద్యాల పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో సోదరి, సోదరుడు మధ్య పోటీ జరిగే అవకాశాలను కొట్టిపారేయలేం అంటున్నారు.