Kuppam : కుప్పంలో దారుణం.. మహిళను చెట్టుకు కట్టేసి వడ్డీ వ్యాపారి అరాచకం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసి అమానుషంగా వ్యవహరించిన తీరు ఆందోళన కలిగిస్తుంది.

Update: 2025-06-17 04:34 GMT

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసి అమానుషంగా వ్యవహరించిన తీరు ఆందోళన కలిగిస్తుంది. భర్త చేసిన అప్పు తీర్చలేదని మహిళను ఒక వ్యాపారి చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టడం సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. సోషల్ మీడియాలో ఈ చిత్రాలు వైరల్ కావడంతో పోలీసులు అప్పటికే నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారిపై కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

భర్త అప్పు ఎగ్గొట్టడంతో...
కుప్పం నియోజకవర్గంలోని నారాయణపురం గ్రామానికి చెందిన శిరీష భర్త తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద ఎనభై వేల రూపాయలు అప్పు తీసుకున్నాడు. మూడేళ్లు అయినా తీర్చలేకపోవడంతో వత్తిడి పెరిగి తిమ్మరాయప్ప భార్యాబిడ్డలను వదిలేసి ఎటో వెళ్లిపోయాడు. భర్త పారిపోవడంతో డబ్బులిచ్చిన మునికన్నప్ప తిమ్మరాయప్ప భార్యను తాళ్లతో చెట్టుకు కట్టేశాడు. భార్య శిరీష అదే గ్రామంలో ఉంటూ బిడ్డలను చదవించుకుంటూ ఉంటుంది. కూలీ పనులు చేసుకుంటూ కడుపు నింపుకుంటూ, బిడ్డలను పోషించుకుంటూ అప్పులను తీర్చేందుకు ప్రయత్నిస్తుంది.
గ్రామానికి కట్టేసి...
తన పుట్టింటికి వెళ్లి నారాయణపురం గ్రామానికి వస్తుండగా శిరీషను అడ్డగించిన ముని కన్నప్పతో పాటు కొందరు మహిళలు ఆమెను చెట్టుకు కట్టేశారు. అప్పు తీర్చాలంటూ ఆమెపై వత్తిడి తెచ్చారు. కన్నబిడ్డ ఏడుస్తున్నా కనికరం చూపకుండా కర్కశ హృదయంతో ప్రవర్తించారు. డబ్బులు ఎప్పుడిస్తావో చెప్పాలంటూ శిరీషను మహిళల చేత ముని కన్నప్ప కొట్టించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనను గ్రామస్థులు ఎవరూ అడ్డుకోకపోగా కొందరు ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది. దీంతో వెంటనే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో కఠినంగా శిక్షించేందుకు సిద్ధమయ్యారు.









Tags:    

Similar News